260
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
చలాయించినది ఆంగ్లసైనిక శాసనధర్మము. ఆనాటి ఆంగ్లధర్మశాస్త్రమునం దనేక విపరీతపు పద్ధతులుండెను. ఎంతచిన్న వస్తువును దొంగిలించినను ఉరిశిక్షవేయుదురు. ఏదైన నొక పత్రమును ఫోర్జరీ చేసినను ఉరిశిక్షయే. దీనికికారణము ఆంగ్లేయులకు ఆస్తిపైనగలకాంక్షయె. సైనిక శాసనధర్మము వారి కివ్వబడక పూర్వము ఈ కంపెనీ వారు తమ దేశస్థులను స్వంత నౌకర్లను గూడ క్రూరశిక్షల పాల్జేయుచు చిత్రహింసలు వధలు జేయుచుండిరి. ఎవనినైన వదల్చుకొనవలె నన్నచో వానిని కొరడాలతో చావబాది చచ్చినపిదప ఈడ్చి వేయుచుండిరి. ఓడదొంగల నురిదీయుట కొసగబడిన అధికారమును పురస్కరించుకొని ఆ నేరమును అనేక సామాన్య వర్తకులపైన మోపి ఉరిదీయుచుండిరి. ఈ సంగతి నింగ్లీషుచరిత్రకారుడే వివరించినాడు. (చూడు: టారెన్సు, పుటలు 21-22)
ఆంగ్లేయ రాజ్యాధిపత్వమును గట్టిపరుపవలెనన్నచో నవాబులకు గల న్యాయవిచారణ అధికారమును దీసివేయుట యవసరమని వారన్ హేస్టింగ్సు గ్రహించెను. అందువలన నీతడు గవర్నరు కాగానే పూర్వమునుండియు న్యాయవిచారణ చేయుచుండిన గ్రామపంచాయతులకును నవాబుయొక్క అధికారులకును గల క్రిమినలు విచారణాధికారములను తొలగించి ఆంగ్లేయ కలెక్టర్లను నియమించినాడు. ఈ మార్పు సహజముగనే జరిగెను. దివానీగిరీ వచ్చినప్పటినుండియు పంచాయతీయొక్క అధికారములు తగ్గింపబడి కంపెనీయొక్క అధికారములు వృద్ధిచేయబడుచునే యుండెను.