Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

257


పూర్తిగా పన్నులు వసూలు చేయునో వానికే వేతనవృద్ధియు పెద్దఉద్యోగమిచ్చుటయు జరుగుచుండెను. అందువలన చిన్ననౌకరు మొదలు తహశీల్దారువరకు పన్నులువనూలు చేయుటలో క్రూరులై ఇచ్చుకోలేని రైతులను గూడ బాధించి కొట్టి, కోదండములు తీయించి, బొండలలో పెట్టి, చిత్రహింసలుచేసి అతిక్రూరముగా పన్నులు వసూలు చేయుచుండిరి. నాటి పన్నులు రైతులు భరింపలేనంత అత్యధికముగా నుండెను. సర్ తామస్ మన్రో ఈ పన్నులలో నూటికి 25 వంతులు తగ్గించవలయునని సలహానిచ్చినను అట్లు జరుగలేదు. తహసీల్దారులు తమకుగల పోలీసు అధికారములను పురస్కరించుకొని ఊరిలోని సామాన్య రైతులను పెత్తనదార్లను కూడ ఏదోమిషపైన తాలూకాకురప్పించుటయు విచారణయను పేరుపెట్టి పడవేసియుంచుటయు ఒకొక్కప్పుడు పన్నులవసూలు సరిగా జరుగలేదను క్రోధముతో అబద్దవునేరములను కల్పించి అనుమానముపైన ఖైదులో పెట్టియుంచుటయు ఇంకనుబాధించి లంచములు పుచ్చుకొనుటకు ప్రయత్నించుటయుగూడ జరుగుచుండెను. అడుగకుండానే లంచములిచ్చు రైతులుకూడ నుండిరి. ఇచ్చినమట్టుకు పుచ్చుకొను తహసీల్దారు చాల మహానుభావుడని వారు సంతసించుచుండిరి. తాశిల్దారు తన యప్రయోజకత్వము బయల్పడకుండా తనతాలూకాలో జరిగిన నేరములను కూడా కప్పిపుచ్చుచుండెను. చింతబరికెలుపుచ్చుకొని పెత్తనదార్లను రైతులను కొట్టి యావత్తు శిస్తుపన్నులు వసూలు చేయు రివిన్యూ ఉద్యోగులు ఆనాడు మిక్కుటముగా నుండిరి.