పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

భారత దేశమున

మహమ్మదీయుల వశముగాకుండ ఇంకను హిందూరాజుల వశమున నే యున్న దేశభాగ మింతకన్న తక్కువ భాగ్యవంతముగ లేదు. విజయనగరసామ్రాజ్యమును దర్శించినవా రెల్లరు దాని విభవమునుజూచి యాశ్చర్యపడుచుండిరి. ఢిల్లీ కనోజినగరములతో సరిపోలు నా నగరవిభవము, ఆరాజుల యఖండ వైభవము, శిల్పపోషణ, కవిపోషణ, సైనిక బలములు, కొలువుకూటములు, స్త్రీ పురుషులు ఆభరణములు ధరించుట, వారి సౌభాగ్యము, నగరములోని శిల్పము, విరివియగు వర్తకము, ధనరాసులుగల యంగళ్ళను (1420-21) ఇటాలియను వాడగు నికోలోకోంటీ, 1522 లో పోర్చుగీసు వాడగు పేయసును, ఉన్నిజు (1535-37) మధ్యను, పెర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ (1443-44) మధ్యను వర్ణించినారు. ఆ కాలమున జనసంకీర్ణములగు నితర మహానగరములుగూడ పేర్కొనబడియున్నవి. “ఇబి౯బట్యూటా' దక్షిణ దేశములో అప్పుడే మహమ్మదీయులు జయించిన మధురానగరమును వర్ణించియున్నాడు. అది ఢిల్లీ నగరమువలె నుండెనట. ఈ గ్రంథకర్తయే తాను రెండు నెలలు మలబారులో ప్రయాణము చేయగా సాగులోలేని భూమి కనపడలేదన్నాడు. గృహస్థులందరికిని తోటలు, దొడ్లు, ఆవరణములు నుండెనట. నాటి రేవుపట్టణములు కన్నులపండువుగ నుండెను. తూర్చుపడమటి సముద్రతీరములనుండిన రేవుపట్టణము లెల్ల మహానగరములుగ నుండెను. ప్రపంచములోని అన్ని దేశములనుండియు వర్తకు లిచ్చటికి వచ్చి నెలకొనుచుండిరి. అరేబియా, ఆఫ్రికా, పెర్షియా, చైనాలతో వర్తకము విరివిగా