శిస్తులనిర్ణయము - వసూలు
241
ఏడవ ప్రకరణము
భూమిశిస్తుల నిర్ణయము - వసూలు
I
కర్షకులస్థితి
భారతదేశము బ్రిటిషువారి వశమగునప్పటికి దేశములో నన్నిభాగములందు నొకేవిధమగు పరిస్థితులులేవు. కొన్నిచోటుల సత్పరిపాలనము మరికొన్నిచోటుల దుష్పరిపాలనము జరుగుచుండెను. కొన్నిచోటుల శాంతిసౌఖ్యములు మరికొన్నిచోటుల కల్లోలము ప్రజాపీడనము నుండెను. గాని మొత్తముమీద గ్రామములు సుభిక్షముగానుండెను. మొగలాయి చక్రవర్తిక్రింద దేశపరిపాలనకొరకు రివిన్యూ వసూలుకొరకు, సైన్యము ప్రోగుచేయుటకొరకు నేర్పడిన రాజప్రతినిధులు, జమీందారులు, తాలూకాదారులు, జాగీరుదారులు, ఉద్యోగులు మొదలగు వివిధతరగతుల పరిపాలకులు, ఉద్యోగులు, భూస్వాములు, ఇజారాదారులు రాజ్యములందు భూములందు వంశపారంపర్యపు హక్కులను స్థాపించు కొనుటకు ప్రాకులాడుచుండిరి. ఆంగ్లేయు లింత సులభముగా దేశాక్రమణచేసినారన్నచో నానాడెంత కల్లోలము, అరాజకము ప్రబలియుండెనో తెలియగలదు. అనేక గ్రామములందు పంచాయతీలద్వారా స్థానిక స్వపరిపాలనాపద్దతి జరుగుచునే యుండెను. గ్రామమునందు కులకట్లు చెరువులు బావులు చిన్న నేరముల విచారణయుకూడ వీనియధికారముక్రింద నేయుండెను.