240
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
మత వర్ణములవలనగాని పుట్టుక, ప్రదేశము, వంశము వలనగాని కంపెనీ కొలువులో ఉద్యోగము చేయుట కనర్హత యుండరాదనియు ఒక సూత్రము విధింపబడెను.
ఆంగ్లేయ విద్యావిధానమును నెలకొల్పుటలో ఆంగ్ల రాజ్యనీతిజ్ఞు లీ దేశవాసుల కాంగ్లరుచులు కలిగించి తమవ్యాపారము : నభివృద్ధి జేసికొనవలెనను ఉద్దేశముండెనని చార్లెస్ గ్రాంట్‌యొక్క కరపత్రమువలన విదితమయ్యెను. ఆనాడు గంభీరోపన్యాసముల జేసిన మెకాలే భారతీయులను కేవలము ఆంగ్లేయ పరిపాలనపట్ల అభిమానముగలవారిగా జేయునుద్దేశము వారి కుండెననియు అంగీకరించియున్నాడు.
ఈ 1833 వ సంవత్సరపు చట్టనిబంధనలను నిర్ణయించినవారిలో మెకాలేయొకడు. ఈచట్టమువలన భారతదేశమునకు హెచ్చుధనవ్యయము కలుగుటకు మార్గము లేర్పరుపబడెను. అందువలన నానాటి స్వదేశసంస్థానముల నేదో మిషపైన బ్రిటీషు రాజ్యములో గలుపుకొని ఆదాయము వృద్ధిచేయవలసివచ్చెను. భారతీయులకు క్రొత్తపన్నులును క్రొత్తసంకెళ్లును వేయబడెను.
1853 లో మరల నొకమారు కంపెనీవారికి రాజ్యపరిపాలనాధికారము నిచ్చు శాసనమును పార్లిమెంటువారు చేసిరి. కంపెనీవారి దుష్పరిపాలనమును గూర్చి అనేక మహజరులు వచ్చినను పెడచెవిని బెట్టిరి. క్రొత్తచట్టమున ఈ రాజ్యాంగమున మార్పు లెవ్వియు చేయబడలేదు. ఈ మారు ఇన్నిసంవత్సరములని గడువు నేర్పరుపకయే పట్టానిచ్చిరి.