Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

223


దివానీగిరిని సంపాదించి రాజ్యాధికారములకు సంబంధించిన పన్నులవసూలు హక్కులుకూడా సంపాదించినందున ఇంగ్లాండు పార్లమెంటువారు కంపెనీవారి వ్యవహారములపైన కొంత అధికారము చలాయింపదలచి దానినిగూర్చి ఒక విచారణసంఘము నిర్మించిరి. 1756 మొదలు 1766 వరకు దేశీయరాజులతో జరిగిన ఒడంబడికలను వానికి సంబంధించిన యావత్తురికార్డును రివిన్యూ లెక్కలను దాఖలుచేయమనిరి. కంపెనీవారు నూటికి 10 కన్న హెచ్చులాభము పంచుకోకూడదని శాసించిరి. కంపెనీవారు ఇంగ్లాండుదేశ ప్రభుత్వమునకు వంగరాష్ట్ర ఆదాయములో నుండి ప్రతిసాలున 400000 పౌనులు అనగా 60లక్షల రూపాయి లిచ్చిననే కంపెనీవారికి క్రొత్తపట్టా ఇవ్వబడునట్లు శాసించిరి. 1769 లో నీ పద్దతి యింకను 5 సంవత్సరములు పొడిగింపబడెను. ఇట్లు భారతదేశ పరిపాలన వలన బ్రిటిష్ ప్రభుత్వమువారు ఆదాయమును గ్రహించుపద్ధతి ప్రారంభింపబడెను. ఈ సమయమున కంపెనీవారి నౌకరులు ధనికులగుచుండగా కంపెనీకిమాత్రము ఋణము కాజొచ్చెను. 1767 నాటికి 60,00,000 పౌనులఋణమయ్యెను. 1770 నాటికి వంగరాష్ట్రమున కలకత్తాలో గవర్నరు, సర్వసేనాని, ముగ్గురు సభ్యులును కలసిన సెలక్టుకమిటీద్వారా పరిపాలన వ్యవహారములు, జరుగుచుండెను. మద్రాసు బొంబాయి మొదలగు ఫ్యాక్టరీల పాలక సంఘములకు దీనితో సంబంధములేదు. అవి ప్రత్యేకముగా నుండెను.