Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


కట్టుటకు కొందఱు విదేశకంపెనీవారికి మాత్రము కొంత సదుపాయము చేయబడుచున్నది. ఇట్లు దేశములోని పరిశ్రమలను, వాణిజ్యమును కంపెనీ సేవకులు నాశనముచేసి దౌర్జన్యముతోను, ప్రజాపీడనముతోను తమయిజారాను నిలుపుకొనిరి. కంపెనీవారు దేశమునుండి తరలించుకొని వెళ్ళిన సొమ్ములోనింకొకభాగము వారి స్వాధీనములోనుండిన రాజ్యభాగములపైనవచ్చు శిస్తు ఆదాయము. వంగరాష్ట్రమునకు కొంతకాలము గవర్నరుగానుండిన వెరెల్‌స్టుగారిట్లు చెప్పినారు.

“బర్డువాను మిడ్నపూరు జిల్లాలయొక్క భూములను వారి పరిపాలనాధికారమునుగూడ మీర్ఖాసీము కంపెనీవారికి 1760 లోనే యిచ్చియుండెను. ప్రాత ప్రభుత్వములోనుండిన , లోపములు పోవలేదు సరికదా ఘోరమైన క్రొత్తపద్ధతులు స్థాపింపబడెను. ఆ భూముల సాగుహక్కును 3 సంవత్సరముల యిజారాగా వేలముపాట పాడిరి. ఎట్టి ఆస్తిగాని మర్యాదగాని లేనివారు కొందఱు పాటపెట్టసాగిరి. ఆ భూముల నిదివరకు సేద్యముచేయుచుండిన రైతులు వానిని వదలుట కిష్టములేక ఈ పోటీలో తలకుమాలిన పాటలుపెట్టిరి. పంటతో సహా స్వాధీనపరచుకొనవచ్చునను నాసతో పైనజెప్పిన దళారీలింకను పెద్దపాటలు పెట్టిరి. ఈ అన్యాయపు పోటీ ఫలితముగా నక్షత్రకులవంటి రాక్షసులు బయలుదేరి ప్రజలను పీడించి సొమ్ము వసూలు చేయసాగిరి." (View of the Rise of the English Government in Bengal - H. Verelst)