క్లైవు చూపినదారి
161
తమ లాభము పోవునని ఆగ్రహపరవశులైరి. అంతట నీకలహమును కారణముగా గైకొని మీర్ఖాసీముపైన యుద్ధము ప్రకటింపజేసిరి. 'స్వార్థపరత్వము న్యాయధర్మములను సిగ్గు, బిడియములను గూడా నాశనము చేయగలదనుట కీ కంపెనీ నౌకరుల పరివర్తనమే తార్కాణము” అని జేమ్సుమిల్లు తన చరిత్రలో వ్రాసినాడు. ఈ యుద్ధములో మీర్ఖాసీమున కపజయము కలిగెను. అంతట నతడు విషాదముతోను, రోషముతోను పాట్నాలో ఆంగ్లేయ నిర్బంధితులను వధింపజేసి రాజ్యము విడచిపోయెను. అంతట పూర్వము కంపెనీ వారే త్రోసిరాజనిన కీలుబొమ్మయగు మీర్జాఫరును మరలతఖ్తుపై నెక్కించిరిగాని ఆతడు కొద్దిరోజులలోనే చనిపోయెను. అంతట నతని జారజుడగు నాజిముద్దౌలాను 1765 లో నవాబుగా ప్రకటించిరి. ఈ సమయములో కంపెనీవారు బహుమతుల రూపమున మీర్జాఫరువలస 500166 పౌనులు, అతని జారజ పుత్రునివలన 230356 పౌనులువుచ్చుకొనిరి. ఇదిగాక 3770833 పౌనులు 'ముజరా' (Restitution) లక్రింద గ్రహించిరి. ఈ నవాబులవలన కంపెనీవారు పుచ్చుకొనిన రాజ్యభాగములపైన వచ్చుచున్న ఆదాయము లీ మొత్తములో చేరని అదనపు ధనము కలదు. ఇదిగాక ఆ సంధిషరతుల ప్రకారమే కంపెనీవారికి సబ్సిడీల క్రిందనిచ్చుట కంగీకరించిన సొమ్ము ప్రత్యేకముగా నిర్ణయింపబడియే యుండెను.