క్లైవు చూపినదారి
149
టయె దీనికి తార్కాణము. ఇక ఫ్రెంచివారన్ననో తమ యుద్యోగులు అనవసరముగా యుద్ధములుచేసి సొమ్ము పాడుచేయుచున్నారని మందలించుచు చీటికిమాటికి వీరిని శిక్షింపజేయుచుండిరి. డూప్లేచూపిన ధైర్య సాహసముల కతనికి కలిగిన బహుమానము తిట్లు, అవమానములు! లాలీ కురిశిక్షయె విధింపబడినది. ఆంగ్లేయుల కీ దేశమున జయము కలుగుట కింకొక కారణము వారికిగల నౌకాబలము. సముద్ర మార్గములెల్ల వారి వశములై యుండి యుద్ధపరికరములు సైన్యములు అందుబాటులో నుండెను. ఫ్రెంచివారి కవి దుర్లభము లగుచుండెను. ఫ్రెంచి నావలను ఆంగ్లేయులు ముంచివేయుచు వారికి నష్టము కలిగించుచుండిరి. ఇట్లు అలభ్యయోగముగా నాంగ్లేయులకు విజయమును ఫ్రెంచివారి కపజయమును కలిగినవి.
రెండవప్రకరణము
క్లైవు చూపినదారి
I
లాభసంపాదన పద్ధతి
భారతదేశమును బ్రిటిషు ఇండియాగా జేయుటకు పునాదులు వేసిన రాజ్యతంత్రజ్ఞుడు రాబర్టు క్లైవు. ఈ దేశ భాగ్యభోగ్యముల నింగ్లాండుకు తరలించుటకు మార్గము చూపిన వాడు నితడే. 1756 నాటి మొగలాయిసామ్రాజ్యములోని వివిధభాగముల స్థితిగతు లెట్లుండెనో పరిశీలింతము.