పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

కొన్నియేండ్లకు బొంబాయిలో వీరి దౌర్జన్యములు వృద్దియైనందున మొగలాయి చక్రవర్తికి కోపమువచ్చి ఉపేక్షింపదగదని తలచి సూరతునుండి వీరిని తరిమించెను. బొంబాయినిముట్టడింపజేసెను. విశాఖపట్టణమును, ఇతర చోటులనుండిన వర్తకస్థానములను, బట్టుకొనెను. కాని ఇంగ్లీషువారు రాజ్యతంత్రనిపుణులు. అతిదీనులై దాసోహమ్మని క్షమార్పణలు కోరుకొనిరి. వారిదీనాలాపములు విని చక్రవర్తి కరుణించి సూరతును మఱల నిచ్చెను. అవసరమైనచో ఇట్లు వీరి నణచగలనుగదా యని చక్రవర్తి యశ్రద్ధవహించెను.

బంగాళమున నున్న సామంతరాజులు మాత్రము పరదేశీయులిట్లు వర్తకస్థానములను, కోటలను గట్టుకొనుట శ్రేయస్కరముగాదని గ్రహించిరి. అంతట వర్తక సంఘమువారు వీరితో కలహింపసాగిరి. ఇది వరకు తాము భరతఖండములోని రాజులకు దాసులమని నటించు తెల్ల వర్తకులు బంగాళా నవాబుతోడి కలహమున నిజోద్దేశములను బయల్పరచిరి. 1615లో చిటాగాంగును పట్టుకొని కొల్లగొనదలచి తమ సైనికుల నంపిరి. ఆంగ్లవర్తకులు బాలసూరును తగులబెట్టిరి. గాని పరాజితులై పాట్నా, కాశీం బజారులలోని తమ వర్తకస్థానములను గోల్పోయి శరణుజొచ్చి రాజీపడిరి. ఆంగ్లేయవర్తకుల కప్పుడు విజయము కలిగినచో భారతీయులు వీరివలనకలుగు ముప్పునకు కండ్లు తెరచియైన నుందురు.

నాటినుండియు నాంగ్లేయ వర్తకులు వర్తకలాభము పొందుటమాత్రముగాక రాజ్యలాభమునుగూడ పొందగోరిరి.