Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు వర్తకసంఘము

141


1639లో చెన్నపట్టణములో వర్తకస్థానము కొర కొకభూమినిసంపాదించి కోటనుగట్టుకొని ఈదేశమున తమవ్యవహారము లెల్ల నిర్వహించుకొనుటకు ముఖ్య కార్యస్థానముగజేసికొనిరి.

మొదటినుండియు నీవర్తకసంఘమువారు తమకొక్కరికే వర్తకము చేసికొనుటకు హక్కుకలదను సూత్రమును స్థాపించుకొన జూచుచుండిరి. ఇతరుల యోడలువచ్చినచో గొణుగుచుందురు. ఓడలోనివారు నిరాయుధులుగ నుండినచో నాయోడలను బట్టుకొనుచుందురు. అట్టి వర్తకు లీ సంఘమువారిచేతబడినప్పుడు వారిని పట్టుకొని దొంగలను బాధించినట్లుగా హింసించినట్లు కొన్ని నిదర్శనములుకలవు.

1664 లో శివాజీ బొంబాయి రేవుపైన బడగ నాంగ్లేయులు సూరతును సంరక్షించుకొనిరి. ఇది విని ఔరంగజేబు చక్రవర్తి వారికి కొన్ని సౌకర్యములనిచ్చుట కంగీకరించెను. అప్పటికి బొంబాయి పోర్చుగీసువారిది. తరువాత ఇంగ్లీషు రాజైన రెండవ ఛార్లెసుకు వరకట్నముగ బొంబాయి వచ్చెను. అంతట నాచక్రవ ర్తి అనుపయోగముగ నుండిన ఆరేవును ఆంగ్లవర్తక సంఘమువారు తనకు సాలుకు పదిపౌను లిచ్చు పద్ధతిని 1669 లో వారి కిచ్చి వేసెను.

ఇట్లు మొదటి యెనుబ దేండ్లలో నింగ్లీషువర్తకసంఘమువారు కొంత స్థిరాస్తిని ధనమును గడించుకొని తమ తోడి వర్తకులపైన గూడ దౌర్జన్యములు జేసియు, పోరాడియు కాలక్షేపము చేయుచుండిరి. నాటిభరతఖండపు ప్రభుత్వము వారు వీరిని లెక్క సేయలేదు.