ఇంగ్లీషు వర్తకసంఘము
137
త్నములు చేయుచుండిరి. ఆ ప్రయత్నములలోనే కొలంబసు అమెరికాను కనుగొని భారతదేశమని భ్రమపడినాడు. ఎట్టకేలకు వాస్కోడాగామా యను పోర్చుగీసు నావికుడు ఆఫ్రికా ఖండమునుజుట్టి భారతదేశము జేరినాడు.
ఆంగ్లేయ వర్తకకంపెనీవా రీ దేశమునకు రాకపూర్వము చాల సంవత్సరములు పోర్చుగీసు డచ్చి జాతీయు లీ దేశముతో నోడవర్తకము చేయుచు అమితలాభము లార్జింపసాగిరి. ఈతూర్పు సముద్రతీరములందలి వర్తకమెల్ల తమకొక్కరికే ఇజారాహక్కులుగలట్లుగా వీరు నిరంకుశులై ఇతరజాతుల వారిని రానివ్వక సముద్రయుద్ధములు జేయుచు బలవంతులై విజృంభించిరి. ఈ ఖండమున సముద్రతీరములందు వారు స్థాపించిన వర్తకస్థానములను సంరక్షించుకొనుటకు కోటలు గట్టుకొనిరి. దీనివలన వారి వ్యాపారమునకు నిలుకడయు దేశీయుల దృష్టిలో గౌరవమును కలిగెను. పోర్చుగీసువారు 1510 లోనే గోవానగరము నాక్రమించి తమ ప్రభుత్వము స్థాపించిరి.
భరతఖండపు సంపదనుజూడగ ఐరోపా దేశములవారి కన్నులు మిరిమిట్లు గ్రమ్మెను. ఐనను మోసపుచ్చి ధనమపహరించుటకు భారతీయు లనాగరకప్రజలుకారు; అడవిమనుష్యులు గారు. వారు విద్యావినయ సంపన్నులు. ప్రకృతి పరిశ్రమలు . వ్యవసాయము లలితకళలు బాగుగ నెఱిగినవారు. పాశ్చాత్య దేశపుసరకులు పుచ్చుకొని తమసరకులనిచ్చుటకు వారికభ్యంతరములేదు. పోర్చుగీసువారు వర్తకము సాగించుకొనుటకు మొదట మొగలాయి సామంతరాజులతో స్నేహముచేసికొనిరి.