Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

131


వించువరకును నేను యువరాజును రాజుగ నంగీకరింపక నా పంతము నెగ్గించుకొంటిని."

II

తూర్పుఇండియా వర్తకకంపెనీవారి తరఫున నీ దేశములో నుద్యోగములు చేయవచ్చిన ఆంగ్లేయుల జీవితవిధానమునందును వారి మర్యాదలందును చాలా మార్పులు కలుగసాగెను. ప్రారంభములో నీ దేశమునకు వచ్చినవా రెల్లరు నొకరినిజూచి ఇంకొక రెంత స్వల్పకాలములో నెంత హెచ్చుధనమార్జించి పోదుమా యను తదేక ధ్యానముతో పనిచేయుచు స్వంత వ్యాపారములుచేసి లంచములు పుచ్చుకొని భారతీయులను వంచించి బాధించి ధనమార్జించి సీమకుపోయి నవాబులవలె జీవించుచుండిరి.

హిందూదేశమున నుద్యోగము చేయుటకు ఒడంబడిక పత్రములు వ్రాసి, వచ్చినేటి ఐ.సి.యస్ . ఉద్యోగులకు పూర్వులనదగిన కవనెంటెడ్ సివిలు సర్వీసులోని ఆంగ్లేయోద్యోగులు ఇంగ్లాండునుండి ఈ దేశమునకు వచ్చునప్పటికి సాధారణముగా పదునేడేండ్లైన నిండని యువకులుగ నుండిరి. వీరికి ప్రపంచానుభవములేదు. ఎట్టి తర్ఫీదునులేదు. దేశభాషలు ఆచారవ్యవహారములు తెలియవు. భారతదేశమునుండి అమిత ధనము దోచుకొనివచ్చి సీమలో మహారాజులవలె సుఖముగా జీవించు వారి యదృష్టమునుజూచి సీమనుండివచ్చు ప్రతి యుద్యోగియు తానుకూడా అట్టి భాగ్యభోగ్యములు పొందుటకు వీలు కలదు గదా యని యువ్విళ్ళూరు చుండెను.