Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

127


పరచి వారివలన లాభము లందుటయు పరిపాటిగనుండెను. 1700 సంవత్సర ప్రాంతమున ఔరంగజేబు చక్రవర్తి వలన క్రొత్తగా నియమింపబడిన కర్నాటక నవాబునకు మద్రాసు ఫ్యాక్టరీవారు పెద్దతుపాకులు చిన్నతుపాకులు అద్దములు విదేశీ సారాయి సీసాలు ఇతరసామానులు బహుమతిగా నిచ్చిరి. ఈ బహుమతుల కతడు తృప్తిజెందక వీరి ప్రతినిధులను కోపదృష్టితో చూచినాడు ఈ నవాబు 1701 లో నొకమారును మరుసటి సంవత్సర మింకొకమారును తన పరివారముతో తరలిరాగా మద్రాసు కార్యస్థానము వారతనిని తృప్తి పరచుట కతనికి రెండవమారు 25 వేలరూపాయలు సమర్పించిరి.

మద్రాసుగవర్నరు పిట్టు 1708 లో మొగలుచక్రవర్తి యొక్క కేంద్రప్రభుత్వముతో నే ఉత్తర ప్రత్యుత్తరములు జరిపి మద్రాసుదగ్గరనుండు అయిదు గ్రామములను కంపెనీకి సంపాదించినాడు. చక్రవర్తియొక్క వజీరు వ్రాసిన లేఖలలో కంపెనీవా రింకను బహుమానము లంపలేదని హెచ్చరించి తమకు పనికివచ్చు బహుమతుల జాబితాను జతపరచినాడు. ఐరోపాలోను ప్రపంచములోను దొరకు అపూర్వ వస్తుజాల మందు వివరింపబడెను. వివిధరకముల గంటల గడియారములు, మరబొమ్మలు, మరసామానులు, పింగాణీలక్కవస్తువులు, చీనా తెరలు, వెండిబంగారు నగిషీవస్తువులు, ఏనుగులు, గుఱ్ఱములు, ఘాటుగల సీమ సారాయములు, ఫిరంగులు, తుపాకులు, రంగు పెన్సిళ్ళు నింక నెన్నో వివరింపబడినవి. ఇంతదయతో వ్రాయబడిన లేఖకు బదులు వ్రాయుచు పిట్టుదొర యిట్లు వ్రాసెను :-