Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

భారత దేశమున


ఆరవ ప్రకరణము

ఇంగ్లీషు దొరతనము

I

ఈ దేశమును జయించుటకు పూర్వము వచ్చియుండిన విజాతీయ పరిపాలకజాతులవలెగాక ఆంగ్లేయు లీ దేశమునకు వచ్చి ఎంతకాలమైనను దేశప్రజలతోకలిసిపోవుటగాని కలసిమెలసి యుండుటగాని లేనేలేదు. కాలము గడచినకొలదియు పాలక పాలిత జాతులమధ్యగల తారతమ్యము వర్ధిల్లి పాలకులలో జాత్యహంకారము వృద్ధిజెంది పాలితులను నీచముగా జూచుటయు నందువలన వైషమ్యములు హెచ్చి పాలక పాలితుల మధ్య పెట్టి యన్యోన్యమును లేకుండుటయు తటస్థించుచున్నది. తామీ దేశమును జయించి దీనిని స్వప్రయోజనము కొరకు తమ బాహుబలమున అణచియుంచి నామనియు ఏక్షణముననైననీప్రజలు తిరుగుబాటుగావింపగలరనియు నొక అనుమానముతో విరోధులమధ్య జీవించుచున్నట్లే బ్రిటిషువారు భావించుచు తమబలమును ప్రజల నణచియుంచుటకే వినియోగించు చున్నారు.

ఈ విజాతీయ పరిపాలననుండి వెలువడి స్వతంత్రులముకావలెనను భావముకలిగి దేశములో జాతీయచైతన్యము కలిగినకొలది బ్రిటిష్‌వారికి రోషము హెచ్చుచున్నది. బ్రిటిష్ పరిపాలనను తొలగించి స్వాతంత్ర్యము పొందగోరు వారి నణచుటలో నీ నాగరకులగు ఆంగ్లజాతివా రవలంబించు