Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

89


జిల్లాలోను ఇట్టి ఆనకట్టలు, చెరువులు, కాల్వలు, బావులెన్నో యుండెను. తరువాత నీదేశమున రాకపోకలకు రోడ్లు, కాలువలు నిర్మించుటయా లేదా రైళ్లు నిర్మించుటయా అను సమస్య చర్చకు వచ్చినపుడు బ్రిటిష్‌వారికి లాభకరమగు రైళ్ళను నిర్మించుట కే తీర్మానించిరి. భారతదేశమున నాంగ్లేయపరిపాలన స్థాపించిన పిదప పబ్లిక్ వర్క్సు కమిషనర్లీ నీటివనరులనుగూర్చి విచారణజరిపియుండిరి. దీనివలన 1840 నాటికే చాల జిల్లాలలోని ఆనకట్టలు కాలువలు, తటాకములు, బావులు మరమ్మతులేక పాడువడిపోయెనని తేలినది. పూర్వము సాగుచేయబడుచుండిన భూములనేకములు బంజరులుగానుండి పోయెననియు తేలినది. మద్రాసులో సాగుచేయతగిన భూమిలో 5వ వంతు మాత్రమే సాగుచేయబడుచుండెను. సేలముజిల్లాలో నుద్యోగిగానుండిన లెఫ్టినెంటుటిర్రెల్ ఆజిల్లాలోని భూములు ఎంతో సారవంతముగా నున్నను అనేకభూములు నీటివనరులు లేక పాడుపడియున్న వనియు తాను ముప్పదిమైళ్ళ దూరములో నెనిమిది పది పెద్దతటాకములు పాడువడియుండుటను చూచితిననియు వ్రాసినాడు (1848), సర్ హెన్రీకాటన్ కూడా ఈ దుస్థితిని వర్ణించియున్నాడు. ఆంగ్లేయ ప్రభుత్వము భూములపైన అన్ని పన్నులు కలిపి ఒకే మొత్తముగా రొఖ్కపుశిస్తు వసూలుచేసిన రైతువారీపద్ధతిలో తానే ఈ బాధ్యత వహించెను. వంగరాష్ట్రమునను ఆగ్రా అయోధ్య పరగణాలలోను ఈ బాధ్యత జమీందారుల పైన వేసెను. ఈ రెండు పద్ధతుల యందు నీదుస్థితియే దాపురించెను. తరువాత కొన్ని ఆనకట్టలు నిర్మించిరిగాని అప్పటికే నష్టము అత్యధికమయ్యెను.