పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

బారిష్టరు పార్వతీశం

యేదో అనబోతుంటే ఆవిడి కొంచెం నవ్వడం, రాజు నా చెయ్యి నొక్కడం యేకకాలమందు జరిగాయి. యేదో పొరపాటు జరిగిపోయిందని హడలిపోతూ యికనైనా జాగ్రత్తగా వుండవలెననుకుంటుంటే “వుడ్ యూ లేక్ టు హేవ్ యే వాష్” అంది ఇల్లాలు. అలవాటు చొప్పున నేను మళ్ళీ పప్పులో కాలు వేయబోయి తెలివి తెచ్చుకుని రాజు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని, “నో థేంక్యూ” అనీ అంతటితో వూరుకోక, అబద్ధమాడడం అలవాటు లేక “ఐ డిడిట్ యెట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్” “వీధి చివర కానిచ్చే వచ్చాలెండి” అన్నాను. యింకేముంది! పిడుగుపడ్డంత పనైంది. ఆవిడ నిర్ఘాంతపోయింది. కొంచెం యెడంగా నిలుచుని మాట్లాడుతున్న వాళ్ళంతా నా మాట వినబడినంతవరకూ స్థంభించిపోయారు.

కొంచెం దూరంలో వున్న బట్లరు గబుక్కున యేదో వాంతి వస్తున్నట్లు నోటికి చేయి అడ్డు పెట్టుకొని అవతలికి పరుగెత్తాడు. వాతావరణం అంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్లనిపించింది. ఏంరా భగవంతుడా! నేనన్న మాటలో తప్పేముంది. వాళ్ళెందుకిలా గడ్డకట్టుకుపోయారు. అని గజగజలాడుతూ కళ్ళనీళ్ళ పర్యంతమై గుడ్లప్పజెప్పి చూస్తుంటే, యజమానురాలే ముందు తేరుకొని, తెలివి తెచ్చుకొని అందరి కేసి ఒకసారిచూచి, ఒక చిరునవ్వుతో వాళ్ళందరకూ చైతన్యం కలిగించి “వెరీగుడ్ మిష్టర్, మిష్టర్ సేం వెరీగుడ్ కం ఎలాంగ్” బాగున్నదండి చాలాబాగుంది. రండి అని నన్నక్కడ అందరికీ రాజు సహాయంతో పరిచయం చేసింది. కొద్ది క్షణాల్లో అందరూ మామూలు ధోరణిలో పడ్డారు. కాని నా బెదురు మట్టుకు వదలలేదు. యెలాగో ఫలహారాలయేదాక కూర్చున్నాను. తరువాత తరుణం కని పెట్టి “నాకు చదువుకోవలసిన పనున్నది. నేనింక వెడతానన్నాను.” “బాగా చీకటి పడ్డది ఒక్కడవూ వెళ్ళగలవా లేకపోతే నేను సాయం రానా” అన్నాడు రాజు. అబ్బేబ్బే అక్కర్లేదు, నేను నెమ్మదిగా పెడతాను. ఫరవాలేదు. అని బైటకి వచ్చే నా బసకు చేరుకుని అక్కడ జరిగిన విశేషాలు యేమిటని మా ఇంటి ఆవిడ అడుగుతే మరేమీ లేవని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం తీసుక్కూర్చున్నాను, నామనస్సు సరిగాలేదని గ్రహించి ఆవిడ ఏమీ మాట్లాడకుండా చక్కాపోయింది. వెళ్ళినచోట ఏదో అభాసు చేశానని తెలుసుకున్నాను. అది యేమిటో మటుకు తెలియలేదు. రాజు పాపం యిదేదో తన తప్పయినట్టు చాలా బాధపడినట్లు కనబడ్డది, సరే యేం చేస్తాం అనుకొని చదువుకుందామని ప్రయత్నిస్తే చదువు సాగక దీని గురించే ఆలోచిస్తూ