పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

బారిష్టరు పార్వతీశం

చిరునామా, ఎలా వెళ్ళాలో అన్నీ వివరంగా రాసి నీకిస్తాను. నాకోసం మూడున్నరవరకూ చూడు. అప్పటికీ నేను రాలేకపోతే, నేను రాసిచ్చిన ప్రకారం వచ్చే సేయి. నీకేం భయంలేదు, ఎక్కడా తప్పిపోవు” అని చెప్పి ఒక కాగితం మీదను అన్నీ వివరంగా రాసి ఒక ప్లాను గూడా వేసి యిచ్చాడు. పాపం. యింక నేను వెడతానని బయలుదేరుతుంటే, అన్నట్టు యింకొక్క ముఖ్యవిషయం చెప్పడం మరచిపోయాను. “మనం వెళ్ళగానే అక్కడ నౌకరుగాని యజమానురాలుగాని, మామూలు గుడీవినింగ్ అయిన తర్వాతను, “వుడ్ యూలైక్ టు హేవ్ ఏ వాష్ అండ్ బ్రషప్” అని అడుగుతారు. అంటే నీ ముఖం చేతులూ కడుక్కోవడం గానీ, తల దువ్వుకోడంగాని, అల్పాచమానం చేసుకోవలసిన అవసరం కాని వుంటే “నో థేంక్యూ” అంటే తీరిపోతుంది. యిది మరచిపోక జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. సరేననియింటికి బయలుదేరి వచ్చే రాత్రి భోజనం చేసి కాస్సేపు, మా యింటి యజమానురాలితో ఈ కబురూ, ఆ కబురూ చెప్పి, కొంచెం సేపు చదువుకొని పడుకున్నాను.

11

మర్నాడు భోజనం, చదువు వగైరాలన్నీ మూడుగంటలకే ముగించుకొని, ముఖం గట్రా కడుక్కొని, రాజు రాక కెదురు చూస్తూ కూర్చున్నాను. అతనెంతకూ రాలేదు. మూడున్నర కూడా దాటింది. ఇంకనూ ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్ళలేనేమోనని బయలు దేరి రాజు రాసిచ్చిన చీటి జేబులో పెట్టుకొని, బయలుదేరి కొంతదూరం ట్రామ్ మీద వెళ్ళి, ఆఖరున కొంచెం దూరం నడవవలసిన మేర ఒక సందులో నుంచి వెళ్ళాను. యేమీ యిబ్బంది లేకుండానే యెవర్నీ అడక్కుండానే ఆ సందు తెలుసుకోగలిగాను. ఇంకను వారింటికి ఒకఫర్లాంగుందనగా మనం అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళేదో అడగడం, మనం వాళ్ళ స్నానాల గదిలోకి వెళ్ళడం యెందుకని ఆ సందు నిర్జనంగావుండి అప్పటికే మసక చీకటిగా వుందని ఆ రోడ్డు వారను లఘశంక కానిచ్చి వారింటికి వెళ్ళాను. అదే యిల్లని నిశ్చయం చేసుకొని గొలుసులాగాక నౌఖరొచ్చి తలుపు తీశాడు.