పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

బారిష్టరు పార్వతీశం

చంపినంతపని చేశావు” అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది.

ఔనండీ! నేనేం చేశాను. ఇంతవరకూ మీకేం జరిగిందో ఎందుకలా భయపడ్డారో నేను చేసిన తప్పేమిటో చెప్పేరు కాదు. నావల్ల తప్పుంటే మన్నించండి - అన్నాను నమ్రతతో! అదికాదునాయనా ఇందులో నీతప్పేమీ లేదు. నామీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమనిచ్చావు. నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నీకు భోజనం పెట్టగానే, ఓ రొట్టె ముక్కకు కాస్త వెన్నా ఆవకాయా పట్టించి నోట్లో పెట్టేసరికీ నసాళం అంటంది. ఆబాధలో ఏంచేయాలో తోచక నీ గదిలో కొచ్చేసరిగి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తినడమే కాక, ఆ చెయ్యి నాకుతుంటే నాకు మూర్ఛవచ్చినంత పనయింది. ఈ పద్ధతులు మా కలవాటు లేక చూడగనే నాకు చైతన్యం పోయింది. అంతకంటే మరేంలేదు. నిన్నూరికే కంగారు పెట్టాను. నువ్వేమీ అనుకోకు నన్ను మన్నించు - అంటూ ఆవిడ బైటకు వెళ్ళిపోయింది. వెనకాలే కూతుళ్ళూ ఆవిడననుసరించి గుమ్మం దగ్గర ఆగి, వెనక్కి తిరిగి నన్ను చూచి ఒక్క నవ్వు నవ్వి పరుగుతీశారు.

మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవా, అది చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధా, అంతా కధ కింద రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు - ఆరోజస్తమానం తల్చుకు తల్చుకుని మేమిద్దరం ఒకటే నవ్వుకోడం. ఈ కధ రాజున్న యింటి ఆవిడకు కూడా చెప్పాం. వాళ్ళూ తెగ నవ్వుకున్నారు. అక్కడనుంచి రాజు మిత్రబృందాని కందరికి వారం రోజుల వరకూ ఈ కధ చెప్పి అందర్నీ నవ్విస్తూ ఆనంద పరవశుల్ని చేశాడు.

నాకు పారాలు బాగా సాగుతున్నాయి. ఇంగ్లీషు నాకు చాలా తొందరగా, బాగా వస్తోందని మా మేష్టరు హృదయపూర్వకంగా నన్నభినందించారు. మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు. రోజూ కాస్సేపు ఇండియన్ అసోసియేషన్ కు వెళ్ళడం, అక్కడ ఓ గంటో రెండు గంటలో కూర్చుని ఏదైనా పుస్తకాలు, పత్రికలూ, చదువుకోడం అలవాటు చేసుకున్నాను. ఆలా బాగాకాలక్షేపం అవుతుండేది. తరువాత అక్కడి కొచ్చే ఇతర సభ్యులు తెలుగువాళ్ళే కాక అరవలు, మళయాళీలు, ఒకరిద్దరు కన్నడీలు, బెంగాలీలు, పంజాబీలు మొదలైన విద్యార్థులతో, క్రమేణ పరిచయం కలుగుతూ వచ్చింది. ఇంతమంది విదేశీయులతో ఇలా పరిచయం ఏర్పడ్డం వాళ్ళందరూ నాతో సమాన స్థాయిలో సరదాగా