పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

191

మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతోందని బాధ పడుతున్నాను” అన్నాను. యింటికి చేరుకుని భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రమించాం.

ఇలా రెండు మూడు రోజులు తిరగ్గా ఎలాగైతేనేం ఒకగది దొరికింది, బాగానే వుంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గదికూడా ఉన్నది. అందులో పెద్ద మంచం దానిమీద రెండు పరుపులు, రెండుమూడు రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి రెండు తువ్వాళ్లు, సమస్తం అక్కడే వున్నాయి. కూర్చునే గదిలో ఒక సోఫా, రెండు పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దానిదగ్గర రెండు మూడు కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అల్మారా లాంటిది. ఒక గోడలోకి అమర్చిన చలికాచుకునే పొయ్యి వగైరాలన్నీ యెంతో అందంగా ఉన్నాయి. మనదేశంలో ధనికులేనా ఎరుగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు యిక్కడ ప్రతి సామాన్యుని గృహములోనూ ఉండడం చాలా ఆశ్చర్యమనిపించింది.

ఇంటి యజమానురాలుకు ఇద్దరు కూతుళ్లు, కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకొని నూతన గృహ ప్రవేశం చేశాను! ఈ దేశానికివచ్చి వారంరోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తూండడం గమనించాను. కొత్త యింట్లో ప్రవేశించడానికి ఈ వేళ మంచిరోజు అవునా కాదా అని తెలుసుకోవడం మరచిపోయాను, తరువాత జ్ఞాపకం వచ్చినా యిక్కడ ఎవర్ని అడుగుతాం. యెవరు చెబుతారు. యెవర్నడిగినా అందరూ నవ్వుతారు కూడాను, పైగా ఈ దేశములో పంచాంగాలూ గట్రా ఏమీ వున్నట్టు తోచదు, అందుచేత యిక్కడ అందరికి మల్లేనే, అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవలసిందే. ఈ గొడవ మానాన్నకు తెలిస్తే యెంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో వున్నప్పుడు ఆదేశాచారాలు అవసరమైనంత వరకూ అనుసరించకపోతే లాభం లేదు. అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడకచుట్ట విప్పవద్దనీ దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్ళూ వుండదనీ రాజు సలహా చెప్పాడు తనే పాపం బజారుకి తీసుకు వెళ్ళి పడకదుస్తులు రెండు పైజామాలూ, ఆకుచెప్పులు, డ్రెస్సింగ్ గౌనూ కొని పెట్టేడు. “పైన ఎలాగూ డ్రెస్సింగు గౌను వేసుకోకతప్పనప్పుడు, లోపల మామూలుగా పంచె కట్టుకుంటే ఏమి” అన్నాను. “పోనిద్దురూ! ఈ బాధ మనకెందుకు! పంచె రోజూ మనం తడిపి ఆరేసుకోడానికి ఇక్కడ వీలుండదుకదా? చాకలికివేస్తే ఇది ఏమిటో ఎలావుతకాలో, ఏం చెయ్యాలో తెలియక వాడూ కంగారు