పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

53

పశ్చిమ చాళుక్యరాజులకు మన బిజ్జన తొలుత సామంతుఁడుగా నుండెను. క్రీ. 1146 ప్రాంతముల నుండి యీతని శాసనములు గలవు. తొలుతటి శాసనములనుబట్టి యీతఁడు మూఁడవతైలపదేవుని సామంతుఁడని యెఱుఁగ నగుచున్నాఁడు. బిజాపురమునఁగల క్రీ. 1151 నాఁటి శాసనమున నీతఁడు మూఁడవ తైలపుని సామంతుఁడనియు, మహాప్రధానదండనాయక సేనాధిపతి బిరుదాంకుఁడైన మైలారయ్య తర్దవాడి 1000ని నీతనికి సామంతుఁడై పాలించుచున్నాఁ డనియుఁగలదు. బలగామి (బెల్గాం) లోఁగల (క్రీ. 1155 నాఁటిది. అది తైలపుని యాఱవపాలన వత్సరము) శాసనమున బిజ్జలుఁడు సర్వదేశములను బాలించుచున్నట్టు గలదు. బిజ్జలుని మూఁడవతైలపదేవునకు సామంతునిఁగాఁ జెప్పు శాసనములలో క్రీ.1155 నాఁటి దగు నీ బెల్గాంశాసనమే కడపటిది. అప్పటనుండి బిజ్జలుఁడు శాసనములలోఁ దన స్వతంత్రపరిపాలనము వ్యక్తమగునట్లు తనయేల్బడి వత్సరములను జెప్పుకొన నారంభించినాఁడు. కాని 1162 వఱకు బిజ్జలుడు పశ్చిమచాళుక్యరాజ్యముపై సంపూర్ణాధిపత్యమును బడయలేదు. అయినను 1056 నుండి సామంతస్థితిని మీఱి స్వతంత్రస్థితికి వచ్చినాఁడు.

క్రీ. 1162 బిజ్జలుని యేడవ పరిపాలనవత్సరము. అప్పటి శాసనములలో నాతఁడు “కలచుర్య చక్రవర్తి” “సమస్తభువనాశ్రయ శ్రీపృథివీ వల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమభట్టారక” బిరుదములఁ జేర్చుకొన్నాఁడు. ఆతని కప్పుడు శ్రీ ధరదండ నాయకుఁడు, పద్మరసు, అమ్మణ, సోమదేవయ్య, విజయాదిత్యుఁడు (మహామండలేశ్వరుఁడు) కార్తవీర్యుఁడు, ఈశ్వరయ్య, సిద్ధలయ్య, కలియమ్మరుసు, పెర్మాడి యనువారు సామంతరాజులుగాఁ బేర్కొనఁబడిరి. క్రీ. 1168 శాసనములో బిజ్జలుఁ డేకచ్చత్రాధిపత్యముగా రాజ్య మేలుచు రాజ్యభారమును దనకొడుకయిన సోవిదేవునిమీఁదఁ బెట్టినట్టున్నది. ఆ శాసనము సోవిదేవునిదే. నాఁటిదే బిజ్జలుని కడపట శాసనము. అది యాతని పండ్రెండవ పాలనవత్సరము. సోవిదేవుని తర్వాత నాతని తమ్ములు సంకమ, ఆహవమల్లుఁడు, సింఘణుఁడు కూడఁ గొలఁదిదినములు రాజ్య మేలిరి. ఏచలదేవి యను భార్యవలన బిజ్జలునికి వజ్రదేవుఁడు, శ్రియాదేవి యను కుమారుఁడును గుమార్తెయుఁ గలిగిరి.