పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

49


దలవంపుగా నుండుటకై శైవు లీకథను గల్పించియుందురనియే నేను దలంచుచున్నాఁడను. తెలుఁగు చెన్నబసవపురాణమున నంతగాఁ జరిత్ర విషయమే లేదు.

చరిత్ర విషయమునఁ జెన్నబసవపురాణము, బిజ్జలరాయచరిత్రము నంతగా విశ్వసింపఁదగినవి కావని నా తలంపు. బిజ్జలరాయచరిత్రము బిజ్జలుఁడు జైనుఁడని చెప్పుచున్నది. కాని, బసవపురాణమున నెక్కడను బిజ్జలుఁడు జైనుఁ డనుట కాధారము కానరాదు. ఆతఁడు జైనుఁ డనుటగూడ యవిశ్వాస్యమే యని నా తలంపు. బిజ్జలునియుఁ దత్పుత్రులయు శిలాతామ్రశాసనములు పెక్కులు నేఁడు దొరకియున్నవి. అందుఁగూడ వారు జైను లనుట కాధారములు గానరాకపోవుటేకాక శివభక్తు లనుటకే యాధారములు గానవచ్చుచున్నవి. వారు శాసనములందు సువర్ణవృషభధ్వజులుగాఁ దెలియవచ్చుచున్నారు. ఇది వారి శివభక్తతను సూచించుచున్నది. బసవన నెలకొల్పిన వీరశైవమున బిజ్జలుఁ డభినివిష్టుఁడు గాకపోవచ్చును. కాని, యాతఁడు శివద్వేషము గలవాఁడు మాత్రము గాఁడు. బసవపురాణమున నట్లెక్కడను లేదు. మఱియు,

క్రీ.1195 నాఁటి యబ్లూరుశాసనము(ఏకాంతరామయ్య విషయము దీనఁ గలదు. అది ముందు దెలియఁగలదు. ఇదేకథ బసవపురాణమునను గలదు.)ను బట్టి చూచిననుగూడ బిజ్జలుఁడు జైనుఁడు గాడనియే యేర్పడును.

“ఏకాంతరామయ్యయును, జైనులును శివుఁడు పరదైవమని జినుఁడు పరదైవమని తగవులాడిరి; ప్రతిజ్ఞాపత్రములు వ్రాసికొనిరి. ఏకాంతరామయ్య ప్రతిన నెగ్గించుకొని జినదేవుని శిరసు విఱుగఁగొట్టించెను. జైనులు బిజ్జలుని కడకుఁబోయి మొఱపెట్టిరి. ఆతఁ డేకాంతరామయ్యను బిలిపించి యడిగెను. రామయ్య తన ప్రతిజ్ఞానిర్వహణమును నిరూపించెను. పునఃప్రతిజ్ఞ సలిపి నెగ్గుదుననెను. జైను లందుకుఁ దూఁగరయిరి. బిజ్జలుఁడు వారిని గర్హించి పంపెను. ఏకాంతరామయ్య నారాధించెను. ఆతఁ డారాధించు వీరసోమనాథ దేవునకగ్రహార మొసఁగెను” అని యాశాసనమునఁ గలదు.