పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

బసవపురాణము


భక్తవరుని ప్రసాదమును బడసి దానిని దన యుత్తరీయము కొంగునఁ గట్టికొని యింటికి వచ్చెను. ఆతని పరోక్షమున నాగమ్మ దానిఁ జూచి కక్కయ్యగారి ప్రసాదమును దనకొఱకై సహోదరుఁడు దాఁచితెచ్చెనని తలఁచి యారగించెను. తర్వాత బసవన దా నారగించుటకై వెదకి నాగమ్మ యారగించుటను దెలిసికొని తన కాభాగ్యము లేకపోయినందుకుఁ జింతిలి తన సహోదరి భాగ్యవిశేషమున కబ్బురపడెను. తత్ప్రసాదాస్వాదమాహాత్మ్యముచే నాగమ్మ గర్భమునఁ గుమారస్వామి యంశమునఁ జెన్నబసవన్న పుట్టెను. బసవన్నకంటె మిక్కిలి యందగాఁ డగుటచే నీతనికిఁ జెన్నబసవన్న యన్న పేరేర్పడెను. [1]బిజ్జలుఁడు నీలలోచనయని పేరుగలదానిఁ దన చెల్లెలిని బసవనకిచ్చి పెండ్లిచేసినట్లు చెన్నబసవపురాణమునఁ గలదని కొందఱు వ్రాసిరి. తెలుఁగు చెన్నబసవపురాణమున నాకది గానరాలేదు.

బిజ్జలుని జగదేవాదులు చంపిన పిదప బిజ్జలుని పుత్రులు మొదలగువారు కొన్నాళ్లకు బసవనను, చెన్నబసవనను, దదాప్తులను జంపుటకై దండువెడలిరి. అప్పటికి బసవన కూడలి సంగమేశ్వరమున సంగయదేవునిలోఁ జొచ్చెను. చెన్నబసవాదులను వారరణ్యమధ్యమున నడ్డగించిరి. చెన్నబసవేశ్వరుని మాహాత్మ్యమున నందు నంధతమసము క్రమ్ముకొనఁగా యాదవులు పరస్పరము పొడుచుకొని చచ్చినట్టుగా నాసేనయెల్ల గొట్టికొనిచచ్చెను. పిదప భక్తులతోఁ జెన్నబసవన్న హుళికపట్టణముఁ జేరి యక్కడిరాజుచే సమ్మానితుఁడై కొన్నాళ్ల కక్కడనే లింగైక్యమందెను.

  1. బిజ్జలుని సోదరి నీలలోచనయనుదానిని బసవన పెండ్లాడెనని, శివావతారమయిన యల్లమప్రభువు కల్యాణము విడిచి శ్రీశైలమున నరఁటిచెట్టులో లింగైక్యమందె నన్నవార్త విని కూడలి సంగమేశ్వరమున బసవన లింగైక్యమందెనని, అది శక 707లో నని, చెన్నబసవపురాణము చెప్పుచున్నట్లు, ప్లీటు మొదలగువారు వ్రాసిరి. తెలుఁగున బసవపురాణమునఁగాని, చెన్నబసవపురాణమునఁగాని యీ విషయములు గానరావు. కన్నడ చెన్నబసవపురాణమున నుండియుండును. తెలుఁగు చెన్నబసవపురాణకారుఁడు (అత్తలూరి పాపకవి) పాల్కురికి సోమనాథుని బసవపురాణమునకు విరుద్ధములుగానుండు విషయములను గొన్నింటిని గుర్తించి తన కృతిలో వానిని విడిచినట్టున్నాఁడు.