పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

33


రచితములయి యుండుటచేతను, హెచ్చుగా నాకథలే బసవపురాణమున వర్ణితములయి యుండుటచేతను, అందును నట్టిద్రవిడభక్తుల చరిత్రములను దెలుపునదియు, మిక్కిలి ప్రాచీనమైనదియునగు 'తిరుతొండర్‌తొఘై' అను గ్రంథము బసవపురాణమునఁ గొంత ప్రపంచితమై యుండుటచేతను సోమనాథుఁ డా కథల నేదేని ద్రవిడగ్రంథమున నుండి గ్రహించి తెలిఁగించెనేమోయని సందేహింపఁ దగును. బసవపురాణమున వర్ణితములగు ద్రవిడభక్తుల చరిత్రములనే వర్ణించు ద్రవిడగ్రంథములలో 'పెరియపురాణ' మను గ్రంథము మిక్కిలి ప్రఖ్యాతమయినది. శివభక్తుల కథల కది నిధానము. ఆ గ్రంథమునకు ద్రవిడభాషలో గొప్పగౌరవము గలదు. అది 'శేక్కిజ్షార్' అను శివకవిచే రచితమయినది. ఆతఁడు సోమనాథుని కంటె నించుకపూర్వుఁడు. అనపాయుఁడను కులోత్తుంగచోడుని యానతిచే నది రచితమయ్యెనని యందుఁగలదట! రెండవ కులోత్తుంగచోడునకే యనపాయుఁడని పేరుగలదు గావునను, ఆతఁడు క్రీ. 1145 నాఁటివాఁడు గావునను దత్కృతమయిన పెరియపురాణమున నుండి సోమనాథుఁడు కథల గ్రహించియుండఁగూడును. కాని, చదివిచూడఁగాఁ నాపురాణమునఁ జెప్పఁబడిన కథారీతులకును, బసవపురాణమునఁజెప్పఁబడిన కథారీతులకును సంబంధమంతగా గానరాకున్నది. స్థూలదృష్టినే సోమనాథుఁడు వానిని గ్రహించియుండవచ్చును.

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమున సూత్రప్రాయముగాఁ గొందఱు శివభక్తుల కథలు చెప్పఁబడినవి. సోమనాథుఁ డాకథలనెల్ల నిందు వివరించినాఁడు. ఇందుఁ దిన్నగా వివరింపకున్న వానిఁ గొన్నింటిని బండితారాధ్యచరిత్రమునఁ జెప్పినాఁడు. బసవ పండితారాధ్యచరిత్రములను రచించు ఛలమునఁ బ్రాక్తనభక్తుల చరిత్రముల వర్ణించి తన వాక్కును బవిత్రపఱుచుకొందునని యాతఁడే చెప్పుకొన్నాఁడు. బసవపురాణ రచనమున కించుక ముందుగాఁ (క్రీ. 1165) హరీశ్వరుఁడను కవిచేఁ గర్ణాటకమున 'శివగణదరగళె' యను గ్రంథము రచితమయినది. అందును శివభక్తుల చరిత్రములే వర్ణితము లయినవి. అదికూడ నీతని గ్రంథరచనముకుఁ దోడ్పడి యుండవచ్చును. మఱియు