పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

15

మీఁది చర్చవలన సోమనాథుని బ్రాహ్మణత్వము నిర్వికల్పముగా నిలువఁగలదని నేను నమ్ముచున్నాఁడను.

సోమనాథుని గురువులు

శ్రియాదేవియు, విష్ణురామిదేవుఁడును నీతనికిఁ దల్లిదండ్రులని యిదివఱకే వ్రాసితిని. ఈతనికి గవితావిద్య నేర్పిన విద్యాగురుఁడు కరస్థలి విశ్వనాథుఁడు.

    “సకృపాత్ముఁడగు కరస్థలి విశ్వనాథు
     ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడ.

-బసవపురాణము



గీ. “విమలచిత్ప్రపూర్తి విశ్వేశవరమూర్తి
    వినయవర్తి భువనవినుతకీర్తి
    విభుకరస్థలంబు విశ్వేశుకారుణ్య
    జనితవిమలకావ్యశక్తియుతుఁడ.”

-అనుభవసారము

ఈతనికి శివదీక్ష నొసఁగిన గురుఁడు గురులింగార్యుఁడు -

'గురులింగవరకరోదర జనితుండ', 'గురులింగ తనూజుండ', 'పేరెన్నఁ బడిన శ్రీ బెలిదేవివేమ-నారాధ్యుఁడను పరమారాధ్యదేవ, మనుమని శిష్యుండ మద్గురులింగ - ఘనకరుణాహస్త గర్భసంభవుఁడ.'

పయివాక్యములవలన బెలిదేవి వేమనారాధ్యుల మనుమఁడయిన గురులింగార్యుఁ డీతని దీక్షాగురుఁడని తెలియనగును. సంస్కృతపండితారాధ్యచరిత్రమునఁగూడ నిట్లే కలదు.

“బెల్దేవి వేమనారాధ్య ప్రశిష్యస్య కృపానిధేః
 గురులింగార్యస్య దయాహస్త గర్భ సముద్భవః.

'మనుమ'డనఁగా నాచార్యవంశమున మనుమఁడని సంస్కృతగ్రంథకర్త గ్రహించెను. కావుననే 'ప్రశిష్యస్య' అనెను.