పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

బసవపురాణము

గ్రంథకర్తకతకరింపరాదు గదా! బసవపురాణమున బ్రాహ్మణగర్హ యుండఁగాఁ బండితారాధ్యచరిత్రమున బ్రాహ్మణప్రశంస గలదు. మల్లికార్జున పండితారాధ్యుఁడు బ్రాహ్మణధర్మముల నాదరించినవాఁడు గావున, నందు సోమనాథున కట్లు వ్రాయవలసెను. బసవేశ్వరుఁడు బ్రాహ్మణధర్మములు గర్హించినవాఁడు గావున బసవపురాణమున నిట్లు వ్రాయవలసెను.

సోమనాథుఁడు బ్రాహ్మణుఁ డగుట నిస్సంశయమే. అయినను మనకాలమువా రయిన వీరేశలింగముపంతులుగారు, రామమోహనరా యోపజ్ఞముగాఁ బేర్వెలసిన బ్రహ్మసమాజసిద్దాంతములమీఁది యభిమానాతిశయముచేతను, తన్మతతత్త్వజ్ఞానాతిరేకముచేతను వయస్సు చాలఁగాఁ గడచిన పిదప యజ్ఞోపవీతాదికమును ద్యజించినట్టుగా సోమనాథుఁడును బసవేశ్వరోపజ్ఞముగా వెలసిన వీరశైవసిద్దాంతముమీఁది యభిమానముచే శివభక్తిపారవశ్యముచే గాయత్రీయజ్ఞోపవీతాదికములను, గులమును జాలవయస్సు కడచినపిదప విడనాడినాఁడేమో యని యాతఁ డాంధ్రదేశమును విడిచి కర్ణాటదేశమునకుఁ జేరుటనుబట్టి నే నించుక సంశయించితిని. కాని, సోమనాథభాష్యమును జూడఁగా నాసంశయమునకు స్థానములేదని యేర్పడెను. గాయత్రీమంత్రము శివపరమనియు ననుష్ఠేయమనియు సోమనాథుఁ డందు వ్రాసెను. బసవేశ్వరునికాలమున వీరశైవమత మాంధ్రదేశమున వేరూనలేదు. బసవేశ్వరునికిఁ దర్వాతఁ జాలఁగాలము గడిచిన తర్వాతనే యల్పాల్పముగా నది యాంధ్రదేశము నంటుకొన్నది.

నేఁటి జంగమజాతివారు పాల్కురికి సోమనాథునికాలమునఁగూడ నాంధ్రదేశమునఁ గలరన్న నమ్మకము కల్మిని గాఁబోలును, దమ్మయ్యగారు పయివాదముఁ దెచ్చి పెట్టిరి. ఆ కాలమున జంగమపదము చరలింగమను నర్థమునఁ గలదే కాని నేఁటి జంగమజాతికి వాచకముగాలేదు. ఈ జాతి యప్పటికింక నేర్పడలేదు.

నన్నిచోడని కుమారసంభవకృతి నందుకొన్న మల్లికార్జునుఁడు పెక్కుచోట్ల జంగమ మల్లికార్జునుఁడని పేర్కొనఁబడెను. కాని, యందే యాతఁడు 'భూసురవంశాద్యుఁడు' ఇత్యాది విధముల బ్రాహ్మణుఁ డనియే ప్రస్తుతుఁడయ్యెను.