పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

13


లెందుఁ గలుగబోదురే శివగోత్ర స
త్పాత్ర భక్తిసూత్రపథచరిత్ర.”

ఈ పద్యములు శివదీక్షితుఁ డగుటచే సోమనాథుఁడు దన జన్మజాత్యాదులఁ బేర్కొననొల్లఁడయ్యెనని తెలుపుచుండుట లేదా? 'ఈశ్వరుకులజుండ, నీశ్వరపుత్రుండ' నని చెప్పికొన్నను నాతని తలిదండ్రులు వేఱుగాఁ గలరని మనము గ్రహించుచుంటిమి గదా!

ఈ సంప్రదాయ మొక్కశైవులందేకాక శాక్తులందును గలదు. శాక్తదీక్ష గొన్నవారు పుట్టినప్పుడు తమకుఁబెట్టినపేరుగాక దీక్షానామమని వేఱొకపేరు ధరింతురు. శైవులకుఁగల గురుకరోదరజనితత్వము వారికిని గలదు. దీక్షాగ్రహణమునాఁటనుండియు జన్మము వేఱయినట్లే వారి నిశ్చయమును. వారికిని జాతాశౌచమృతాశౌచాదులు నిషిద్ధములే. ఈ విషయమున శాక్తతంత్రములకు శైవతంత్రములకు సాదృశ్యమే. కాలాముఖపాశుపతాదిశైవు లిట్టినియమములు గలవారే. కాని, బసవేశ్వరోపజ్ఞముగా నుద్భుద్దమయిన వీరశైవము మాత్రము వీరవ్రతముగలదై కొంతవిలక్షణవిధానము గాంచినది. తద్విషయము బసవేశ్వరమత మనుచోటఁ బ్రపంచించి వ్రాయుదును.

సోమనాథుఁడు బ్రాహ్మణుఁ డయినను దీక్షితుల సంప్రదాయము చొప్పున జన్మగోత్రసూత్రాదికములను జెప్పుకొనకపోయెను. ఇతరవిధముల నాతని బ్రాహ్మణత్వము ప్రవ్యక్తమగుచున్నను నీయసమర్థసాధనమును గొని యాతఁడు బ్రాహ్మణుఁడు కాఁడనుట యుక్తమా?

ఇఁక బసవపురాణమున బ్రాహ్మణులను 'ద్రాటిమాల'లని, 'పచ్చిమాల' లని గర్హించుటచే సోమనాథుఁడు బ్రాహ్మణుఁడు గానేరఁడనుటయు నసంగతమే యగును. పయితిట్లు సోమనాథునివి గావు. వీరశైవవివాదములందు బసవేశ్వరాదుల వాక్కులను సోమనాథుఁడనుకరించి చెప్పెను. కాని, యవి సోమనాథుఁడు స్వయము నోరారఁ దిట్టినవిగావు. గ్రంథమునఁ బ్రసక్తులగు కథాపురుషుల పనులను, బలుకులను ననువదించినంత మాత్రమున వానిని