పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

బసవపురాణము

భక్తహితార్ధమై ప్రభవించెఁగాక - వ్యక్తిగా నతఁడీశ్వరాంశంబ కాఁడె
యని నుతింపుచుఁదొంటియట్ల సద్భక్తి - జనితసుఖామృత వనధిమధ్యమున
నోలలాడుచు నుండి రురుతరానంద - లీలమై నటు గొంతగాలమింపారఁ
బ్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణఁ - బ్రస్తుతికెక్కిన బసవని చరితఁ
జెప్పితి భక్తులచే విన్నమాడ్కిఁ - దప్పకుండఁగను యథాశక్తిఁజేసి
యిమ్మహి నీశున కెఱుఁగంగరాని - యమ్మహాబసవని యద్భుత చరిత
వర్ణింప నెంతటివాఁడ నట్లయ్యు - వర్ణనచేసితి వారిన కాని
యేయెడ నన్యధా యెఱుఁగ నే ననెడి - యీ యొక్క బలిమి మహిష్ఠతకలిమి
నదియునుగాక మహాభక్తవరుల - సదమల దివ్యప్రశంసగాఁజేసి
భావించినాదు వాక్పాననార్థంబు - గావింప మేటి యీ కథ రచించితిని
బసవపురాణంబుఁబాటించి వినిన - నసలారుఁబో ప్రసాదానందసిద్ధి
బసవపురాణంబుఁబాటించి వినిన - వసియించు సద్భక్తి వాసనమహిమ
బసవపురాణంబుఁబాటించి వినిన - బసిగమైఁబ్రాపించు భక్తులకరుణ
బసవపురాణంబుఁబాటించి వినిన - బసరించు లింగానుభవనిత్యసుఖము
బసవపురాణంబుఁబాటించి వినిన - నెసకంబుతోఁగల్గు నీప్సితార్థములు
బసవపురాణంబు భక్తి వ్రాయించి - వసదిగాఁజదివెడు వారలకెల్ల
దురితము లాపదల్ ద్రోహంబులెల్ల - హరియించు నెంతయు హరుకృపఁజేసి
యీ పురాణం బెవ్వరేఁదమ యింట - నేపార నిడికొన్న నిహపరసిద్ధి
శరణోపకార బసవపురాణార్థ - విరచితత్రిభువన విఖ్యాత చరిత!
శరణోపకార బసవపురాణార్థ - వరభుక్తిముక్తి సంవర్ధనభరిత !
శరణోపకార బసవపురాణార్థ - సరససమంచిత సత్యవాగ్జాల!
గొబ్బూరి మాదన్న కూరిమిశిష్య! - గొబ్బూరిసంగ సద్గుణ సముత్తుంగ!
ఇది యసంఖ్యాత మాహేశ్వర దివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోప భోగ - సంగత సుఖ సుధాశరధి నిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగఘనకరస్థల విశ్వనాథ - వరకృపాంచిత కవిత్వసూర్తిఁబేర్చి
చను బసవపురాణ మనుకథయందు - ననుపమంబుగ సప్తమాశ్వాసమయ్యె.