పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

బసవపురాణము

'తా నసంఖ్యాతుల యానతి యదియు - నీ నరాధముఁబొలియించితి మేము
అధికులౌ భక్తులకహితంబుసేయు - నధములందఱును నివ్విధిఁబోదు'రనుచు
గాయముల్[1] బిగియుచుఁగతులుద్రొక్కుచును - రాయముల్గొనుచుదండలనటింపు
బొంగిబొబ్బిడుచుఁజెలంగి యార్చుచును - లింగభక్తులకెదుర్లేరు వొండనుచు
బిండుగాఁబౌరులు బిజ్జలునితల - గుండుగండా! యని ఘూర్ణిల్లుచుండ
మగిడి యా మల్లబ్రహ్మయగారుఁ దాను - నగరువెల్వడి తన నగరికి వచ్చి
తల్లికి నందంద ధరఁజాగిమ్రొక్కి - సల్లలితాంగి ప్రసాదంబు వడసి
'పరమపాతకు నట్టి భక్తనిగ్రహునిఁ - బొరిగొన్నయంతన పోవ దాద్రోహి
నప్పుడేచంపక యరుదెంచినట్టి - తప్పున కింకొండు దండమున్నదియు'
ననుచు నజ్జగదేవుఁడంతలోపలను - తన శిరంబున కల్గికొని విమానములఁ
బుత్రమిత్రకళత్ర గోత్రాదులను వి - చిత్రంబుగా నప్డ శివలోకమునకుఁ
గొనిపోయెఁ గటకంబుజనులెల్లబెదరి – కనుకనిఁబఱవంగఁ గ్రందువుట్టుటయుఁ
గన్నభక్తులు వార్తవిన్నభక్తులును - నున్నభక్తులుఁబోయి రొక్కొక్కయెడకు
నంతరాజ్యార్థమై యనిచేసి యతని - సంతానమెల్ల నిస్సంతాన మయ్యె
వీఁకఁ గొట్టములలో వెలిఁగె గుఱ్ఱములు - తోఁకల నిప్పులు దొరుగ నక్షణమ
కరులును గరులును గన్నంత నెదిరి - పొరిఁబొరిఁదాఁకి జర్జరితమైపడియె
బ్రసి యమాత్యాది భటవర్గమెల్లఁ - దమలోనఁ జచ్చిరి సమరంబుసేసి
బసవని సత్యశాపమునఁగాఁజేసి - పసచెడి కటకంబు వాడయ్యె నంత
వినియె నంతయు నట చనియెఁ గూడలికి - గనియె సద్గురువు సంగయదేవునచట
భక్తులుఁదానును బరమానురాగ - యుక్తి నబ్బసవయ్య యుండె సంప్రీతి
నంత నా గురువు సమంచితనాద - సంతతపూజాది సత్క్రియావలుల
ముంచి భజించి కీర్తించి మెప్పించి - మించి విన్నపమాచరించి ప్రార్ధించి
“దేవ సద్గురుమూర్తి దివ్యలింగాంగ - దేవ నా సంగయ్యదేవ ప్రాణేశ
నీదుసద్భక్తప్రసాదంబుఁగుడిచి - యాదట బ్రదికి యింతైతిఁ గావునను
భవభవంబుల వారి పన్నఁగాఁదగుదు - భువివారి ఋణమునఁబోవుటగలదు
అంతియకాని నిన్నడిగినచోటు - నెంతైన నేమైన నిచ్చినచోటు
గలతప్పుసైరించి కాచినచోటు - గలదేని చెప్పుమా కానమీయందు
పుట్టినమొదలును బోఁకయుఁబొరయ - వట్టికొల్వున నిన్ను ముట్టఁగొల్చితిని
వెట్టిచేసిన నీకు వెయ్యేఁడులైన - నెట్టును మేలకా కెగ్గేమి తలఁప

  1. బిగిచియుఁ గతికిఁ ద్రొక్కొనుచు