పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

బసవపురాణము

అల్లయ్య మధుపయ్యల కథ

మఱియంత నల్లయ్య మధుపయ్య యనఁగఁ - గఱకంఠుభక్తు లకర్మసంచయులు
లింగైకనిష్ఠావిలీనమానసులు - జంగమారాధనాసక్తచేతసులు
పరమశివాచార పరవర్త్మనిరతు - లురుతరకీర్తి నియుక్తులు నాఁగ
నసమానలీలఁగళ్యాణంబునందు - బసవఁడు దారు నప్పాట వర్తింప
నంత బిజ్జలుఁడు దాఁ గొంతకాలమున - కంతకు ప్రోలికి నరుగంగఁదలఁచి
బసవని మహిమయు భక్తి మహత్త్వ - మెసకంబు నెఱిఁగియు నెఱుఁగనియట్లు
పొదలిన యజ్ఞానబోధగాఁజేసి - మదియించి యల్లయ్య మధుపయ్యగారి
తప్పేమియునులేక చొప్పుగా దనక - రప్పించి కన్నులు వుప్పించె నంత
'కాలకాలునిభక్త గణముల మహిమ - లేల తా మున్నును నెఱుఁగునుగాదె
యక్కట చెడఁజూచె నవనీశుఁడింక - నిక్కటకంబున కెక్కడిబ్రదుకు
మృడుభక్తు లలిగినఁజెడఁడె తా” ననుచు - జడిగొని నరులెల్ల బుడిబుళ్లువోవ
బసవఁడు మొదలుగా నసమాక్షుభక్తు - లసమకోపోద్దీపితాంగులై పొంగి
మసలక యల్లయ్య మధుపయ్యగారి - కసలారఁగాఁగన్ను లప్పుడ పడసి
'యింక నుండఁగఁగూడ దీయూర' ననుచు - శంకరభక్తులు జగదేవమంత్రిఁ
'బనిచినతొల్లింటి బాసగైకొనుము - తునుము శివద్రోహి' ననుచు బిజ్జలుని
నొసలిరేఖలు గసిబిసిచేసి రాజ్య - మసమాక్షుకవిలియ నటు దుడిపించి
బల్లహుకటకంబు వదటిపా ల్సేసి - యెల్లవారును జూడ నీక్షణంబునను
'బాడగుఁ [1]గటకంబు వాడగుఁగూడఁ - బాడగు' ననుచు శాపంబు లిచ్చుచును
రాచిన మడివాలు మాచయ్యగారు - నాచౌడరాయఁడేకాంతరామయ్య
కిన్నర బ్రహ్మయ్యయు గేశి రాజయ్య - కన్నడ బ్రహ్మయ్య గక్కయగారు
మాది రాజయ్యయు మసణయ్యగారు - నాదిగా నప్పురి యఖిలభక్తులును
దండిజంగమకోటి దనతోడ నడవ - బండారు బసవనదండనాయకుఁడు
నెసఁగఁ గప్పడి సంగమేశ్వరంబునకు - వెస నేఁగె బిజ్జలు నెసకంబు దలఁగ
గటకటా కఱకంఠు గణములు వోవఁ - గటకంబుభాగ్యంబు గ్రక్కునఁదొలఁగె
భూకంపమయ్యెను భువి నర్ధరాత్రి - కాకు లఱచె వంటకంబులు వ్రుచ్చె
ధరఁబడె నుల్క లత్తఱి ఱాల వాన - గురిసె భాస్కరచంద్రపరివేషమయ్యె
దివిదీటుకట్టె వేసవి మూఁగె మంచు - గవిసెను మధ్యాహ్న కాలంబు నందు

  1. గళ్యాణపట్టణంబింకఁ