పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

241

ఘనసారవృక్షముల్ ఖండించి వెల్గు - పెనుజెముళ్లకుఁ జుట్టుఁబెట్టినయట్లు
నగ్గిలోపల మూత్ర మఱిముఱిఁబోసి - డగ్గఱి వేల్వఁదొడంగినయట్టు
లచ్చుగా నర్ఘ్య[1]పణ్యమ్ములు దెచ్చి - యిచ్చఁగుక్కల కాళు లిలఁబూన్చినట్టు
లోడునఁబోసిన యుదకంబులట్లు - నీడమాలిన ధరణీరుహంబట్లు
రాజితలింగపరాఙ్ముఖానేక - పూజలు నిష్ఫలంబులు గావె తలఁపఁ
ద్ర్యక్షపరాఙ్ముఖక్రతు వాచరించి - దక్షుఁడెఱుంగవే తలఁగోలుపడియెఁ
బరశురాముఁడు దొల్లి బాఁపల కర్థి - ధర యిచ్చి యెఱుఁగవే తా నేమి గనియె
నిల యెల్ల నెఱుఁగ విప్రులనె పూజించి - బలి బంధనంబునఁబడఁడె తెల్లముగ
నడరంగ గౌతముఁ డగ్రజన్ములకుఁ - గుడవఁబెట్టియ కాదె గోహత్యఁజెందె
వేదజ్ఞులగు కోటివిప్రుల కన్న - మాదటఁబెట్టిన యట్టి ఫలంబు
త్ర్యక్షభక్తున కొక్కభిక్షంబు వెట్టు - నక్షయఫలమున కసమాన మనుట
వ్యక్తమైయుండఁ గుయుక్తుల నడవ - భక్తియుఁజెడు దానఫలము నిష్ఫలము'
నని పెక్కు భంగుల నానతిచ్చుడును - విని శోకజలసమన్వితనేత్రుఁడగుచు
జగదేవుఁ డాభక్త జననికాయంబు - మొగిఁబ్రస్తుతింపుచు మోడ్పుఁగే లమరఁ
“గర్మబద్ధుఁడనైతిఁ గష్టుఁడ ఖలుఁడ - దుర్మదోపేతుఁడ దుష్కృతాలయుఁడఁ
బ్రజ్ఞావిహీనుఁడఁ బరమపాతకుఁడ - నజ్ఞాని నధికసర్వాపరాధుండ
శంకమాలిన యనాచారుండ దీని - కింకఁబ్రాయశ్చిత్త మేమియు లేదు
పాన లేటికి విడుఁబ్రాణంబు గెలస - మానతి యిండు ఆన” కని మ్రొక్కి నిలువఁ
గనుఁగొని బసవయ్య ఘనభక్తవితతి - యనుమతంబునఁగూడ నతని కిట్లనియె
“గొంకక విను మఱికొన్ని దినముల - కింక శివద్రోహ మిట పుట్టఁగలదు
మడియింపు ద్రోహిని మా కెక్కెఁగెలస - మడరఁ బ్రసన్నుఁడయ్యెడి శివుఁడప్డు
ఈ నిర్ణయమునకు నీశానగణ వి - తాన మెంతయు మెచ్చి తత్ర్పస్తవంబు
నిమ్ములఁగరుణించి యిచ్చిరి నీకు - నమ్ము ముమ్మాటికి లెమ్ము లె” మ్మనుడు
[2]నంగద మోడ్పుఁగే లలికంబుఁజేర్చి - పొంగుచు వీరతాంబూలంబు గొనుడు
జగదేవశరణుని నగరికి బసవం - డగణిత భక్తసహాయుఁడై యరిగె
నసలార నుచితక్రియాదులఁదనిసి - బసవన్న యసమసద్భక్తులుఁదాను
ననయంబు భక్తిసుధామృతాపార - వనధి నిమగ్నుఁడై వర్తింపుచుండె

  1. పాద్యమ్ములు
  2. సంగతి నిటలానఁ గెంగేలుసేర్చి