పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

బసవపురాణము

నని నాచిదేవయ్య యఖిలంబు నెఱుఁగఁ - దనయు విసర్జించె ననుచు నాద్యోక్తి
మార్గంబులుండఁగుమార్గంబులూఁది - మార్గమే యీ త్రాటిమాలలఁగలయఁ
బశుపాశపతి యుండఁబశువులౌ [1]పంద - పశుజీవులకుఁబెట్టు పందలఁబట్టి
సోడంబుతో ముక్కు మోడుగాఁగోసి - కూడ నిట్టికఁబ్రామ కేడఁబోవచ్చు
ఖండేందు ధరుఁడిట్టికర్ముల యొద్ద - నుండునే మా భక్తు లొద్దనే కాక
రాచిన శుద్ధశివాచార మహిమ - నాచుఁడ యెఱుఁగంగ నీ కేలవచ్చు
దృష్టిహీనుండు దా దీప మే మెఱుఁగు - నష్టకర్ణునకును నాద మేమిటికి
జ్వరపీడితుఁడు వాలచవి యే మెఱుంగు - సరి గప్ప లెఱుఁగునే జడనిధిలోఁతు
వానరం బెఱుఁగునే వరరత్నమహిమ - శ్వానం బెఱుంగునే స్వర్గలోకంబు
రా నేర్చునే పుష్పరసమున కీఁగ - కాన నేర్చునె రవిఁగౌశికవితతి
యజ్ఞానజీవుల కతులితభక్తి - ప్రాజ్ఞత యిదియేల ప్రాపించుఁజెపుమ
ముంగిటిపెన్నిధి దంగేటిజున్ను - నంగిటనూరెడు నమృతంబనంగఁ
జను నేకలింగ నిషాభక్తియుక్తిఁ - జనకదుష్పథములఁజరియించు టెల్ల
రాజితాంచితరత్న రాజ ముండంగ - గాజుపెంచిక లేఱ గమియించినట్లు
తవరాజ మమరి ముందఱఁబ్రోఁకయుండ - తవుడు బొక్కుదునని తలఁచినయట్లు
దొడ్డిలోసురధేను [2]వొడ్డుగాఁగురియ - గొడ్డుఁ [3]బిదుకఁగుండఁగొనియేఁగినట్లు
నక్కజంబగుచు వజ్రాయుధంబుండ - మొక్కలసురియకు మోహించినట్లు
పొట్టపొర్వునఁగల్ప భూరుహంబుండ - వట్టివృక్షమునకు వడి నేఁగునట్లు
నొదవంగ వఱ్ఱేట నోడ యుండంగ - వద రూఁదినట్టు లీ వసుమతిలోన
మంగళంబగు భక్తిమార్గముండంగ - వెంగలులై కర్మవిధి యూఁది చెడుట
స్మృతి తేన సహ సంవ సే”త్తని మ్రోయ - మతిహీనులకు నేల గతమగుబుద్ధి
నెఱి నెన్నిమాఱులు నీళ్లలోపలను - గొఱుపడంబుదికిన మఱి తెల్లనగునె
యేనాఁట బ్రద్దల నెంత గట్టినను - శ్వానంబుతోఁక దాఁజక్కన యగునె
మానక జలములలోన నేప్రొద్దు - నానిన శిల మెత్తగానేర్చు నెట్లు
నెడపక పాలు దానెన్నివోసినను - విడుచునే సర్పంబు విస మొకింతైనఁ
బొలుపుగాఁదేనియ వోసి నూఱినను - నిలఁదీయనై యుండునే వేఁపనార
పన్నుగానే లెంత వ్రామి కడిగిన - మన్నుఁదాఁబోవునే మఱియట్లుఁగాక
పసిఁడినాఁగటఁబెక్కుభంగుల దున్ని - వెస ముల్కవిత్తులు వెదవెట్టినట్లు

  1. బండ
  2. వొడ్డుక, వొడ్డుకొన్కు
  3. జీఁటఁగ