పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

229

యాదిమార్గమొ బల్మియో దీనిఁజెపుమ - కాదేని నాడికో కార్య మేమైన
యూరక కుడుచుట యుచితమే యనిన - ధారుణీశ్వరునితోఁదా నిట్టు లనియె
నిచ్చుట గలదు సండేశున కభవుఁ - డిచ్చిన తెఱఁగు మీ రెఱుఁగ రే వినుడు
బాణలింగములందుఁబటికంబులందు - బ్రాణలింగములందుఁబౌష్యరాగాది
లింగంబులందును లేదు ప్రసాద - మంగజహరునికి నాగమోక్తముగ
ధర మానవులు మహేశ్వరు ప్రసాదంబు - ధరియించినను గొన్నఁదారు సూచినను
నరయక దాఁటిన నరకాగ్నిశిఖల - నెరియుదురని శ్రుతు లెందును వినరె
శ్రీగురుకరుణానురాగ ప్రసాద - మాగమవిధ్యుక్త మగు ప్రసాదంబు
సుప్రసన్నానంద శుద్ధప్రసాద - మప్రతర్క్యాది లింగప్రసాదంబు
పరమపవిత్ర సంపత్ప్రసాదంబు - స్థిరభవరోగౌషధీ ప్రసాదంబు
సత్యప్రసాదంబు నిత్యప్రసాద - మత్యుత్తమోత్తమం బగు ప్రసాదంబు
గరళకంధరు కృపాకలితప్రసాద - మరుదగు సంగమేశ్వరు ప్రసాదంబు
మలదేహులకు మీకుఁదలమె భోగింప - మలహరుభక్తుల యిలుపుట్టువృత్తి
పూని లింగప్రసాదానూనసుఖము - మానవులకుఁబొందఁగా నెట్లువచ్చు
నేనుఁగుపన్నగునే గాడిదలకు - నేనాఁటఁగన్నులఁ గానరు గాక
యిచ్చుచోఁగెడిపితిమే ప్రసాదంబు - నిచ్చినకొన్న చోటెన్నఁడుగలదె
యిదియేల వెడగథ లిన్నియుఁబన్న - గుదగుదపడక నెమ్మదినుండుఁ"డనిన
“వారణాసి గయఁ గేదారంబునందు - సౌరాష్ట్రమునను దాక్షారామమునను
శ్రీగిరియందును సేతుపురోగ - మాగమస్థానంబులందెల్ల మాకుఁ
జెల్లఁగ మీరెట్లు చెల్లఁగనీరు - బల్లిదమైన మా ప్రాణంబులైన
విడుతుముగాక మామడిగూటివృత్తి - విడుతుమే యిదియేమి విపరీత[1]వృత్తి”
యనుచు బోయలులేచి కనుకనిఁబలుకఁ - గనుఁగొని బసవయ్య గన్నులనగుచు
వట్టియాకులు గాలి వడిఁదూలుఁగాక - మెట్టలు దూలునే యెట్టిగాడ్పునను
బెండ్లు దేలెడిఁగాక పేరేట నైన - గుండ్లు దేలునె మఱి తండ్లవియేల
బలువునఁగొన హరిబ్రహ్మాదులకును - గొలఁది గాదనిన మీ కొలఁదియె తొరల
[2]వలదు మీ రెంతటివారు గావునను - చల ముడ్గి తొలఁగుఁడు తెలివిడిఁగొనుఁడు
శైవశివాలయస్థానంబు దక్క - నే వీట నేనాఁట నిలఁదొల్లి నేఁడు.

  1. మింక
  2. వలవదుమీ రెంత