పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

225

హరభక్తుఁడధమజాత్యావృతుఁడయ్యు - ధర నున్న నేమి యాతనిప్రాప్తి సెడునె
రాజీవ మరయఁబంకేజంబు గాదె - పూజకు నది యెట్లు పూజ్యమై పరగెఁ
గాష్ఠోద్భవంబయ్యుఁగాదె పవిత్ర - నిష్ఠితంబై పొల్చె నెరి ననలంబు
యెట్టిదుర్జాతిని బుట్టిననేమి - యెట్టును శివభక్తుఁడిలఁబవిత్రుండు
నీ యగ్రజన్ముల కెల్లను గురువు - బోయెతకును గాదె పుట్టె వ్యాసుండు
పూర్వద్విజాచార్యుఁడుర్వి వసిష్ఠుఁ - డూర్వశియను లంజె కుదయించెఁగాదె
మాతంగుఁడనఁగ బ్రహ్మర్షి యొకండు - మాతంగికిని గాదె మహిఁబ్రభవించె
శునకగార్దభ మ్లేచ్ఛశుకదర్దురాది - జనితమునీంద్రాదిజాతము లెల్ల
శివభక్తిఁగాదె విశిష్టమై పరగె - నవనీశ యెఱుఁగవే యందఱ ననిన
విని బిజ్జలుఁడు రోషవిహ్వలుఁడగుచుఁ - గనుఁగొని బసవరాజునకు నిట్లనియెఁ
“బనిలేనిమాటలుఁబాటలుఁగథలు - విన విరుద్ధము లాడ వేసర వీవు
బత్తులఁజిదిమినఁబాలు గాఱెడినె - నెత్తురు గాఱెడినే యొడ్లఁజిదుమ
యిట్టిమార్గములు మున్నెఱుఁగ మే” మనిన - దట్టుఁడు బసవయ్య దా నంత లేచి
“భర్గునిఁగాదని పలుద్రోవ లేఁగు - దుర్గుణు లగు శివద్రోహులతోడ
నడరఁగ వేదభరాక్రాంతు లనఁగఁ - బడిన బ్రాహ్మణ గార్దభంబులతోడ
మహితప్రణవదివ్యమంత్రోపదేశ - రహితులై చను వ్రతభ్రష్టులతోడఁ
జాల దధీచ్యాదిశాపాగ్ని శిఖలఁ - గాలిన కర్మచండాలురతోడఁ
బట్టిప్రాణముతోడఁబశువు వధించు - కట్టిఁడు లగు పశుకర్ములతోడ
[1]జన్నెనుదొరలినఁజాగఁగఁబెట్టు - మన్నట్టి యధికపాపాత్ములతోడ
వీసానకై యెట్టి దోసాన కైనఁ - జేసాఁచికొను కర్మజీవులతోడ
మానుగా సురపాటిగా నర్థి సోమ - పానంబు గావించు పాఱులతోడ
నిన్నియుఁజెప్పంగ నేల తాఁజంపి - జన్ని సంపె నను దుర్జాతులతోడఁ
బ్రతిసేసి యాడినఁబాపంబు వచ్చుఁ - బ్రతినసూపమి భక్తిపంతంబుగాదు
శివనాగుమయగారి శ్రీహస్తమంద - నివిడి చూపెదఁబాలు నీ వన్నయట్లు
నీ మహీసురులలో నెన్నఁగఁబడ్డ - సోమయాజులఁదర్గి చూపుఁడా నీళ్లు
అటుగాక తక్కినఁగటకంబుచుట్టుఁ - గుటిలాత్ములను [2]దొడుగులఁబఱపింపు
మనుచు బిజ్జలభూసురానుమతమునఁ - జని సదాసిద్ధ బసవచక్రవర్తి

  1. జన్నని
  2. దోడుగుల