పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

బసవపురాణము

నదె చూడుఁడని చల్లునమ్మాత్రలోన - పొదలి భుగుల్భుగుల్భుగులన నెగసి
నిటలతటాంబకోత్కట చటులాగ్ని - పటుదృష్టిఁ బురము లొక్కటఁగాలునట్లు
నట యిట విప్రాలయంబులన్నియును - నటుగూడ దరికొని యాహుతుల్గొనఁగ
శ్రీధరభట్టిల్లు సిచ్చునఁగలసె - మాధవప్పనయిల్లు మంటపా లయ్యె
గ్రుడ్డిగోవిందుని గుడిసెయుఁగమరె - దొడ్డభాస్కరునిల్లు దొడిఁదొడిఁగాలె
కొమ్మనఘటశాసి కొంపయుఁ గమలె - బమ్మనభట్టిల్లు భగ్గన మండె
వామనప్పనయిల్లు వాసము ల్సిక్కె - సోమయాజులయిల్లు సురసురఁగమరె
త్రేదులవారిల్లు దెరువునఁగలసె - నాదిత్యకూచియి ల్లప్పుడ పొలిసె
మచ్చతాడనయిల్లు మంటిపాలయ్యె - బచ్చలికేశవుపాకయు మడిసె
వాసుదేవునియిల్లు వహ్నిసేకొనియె - మాసకొమ్మనయిల్లు మసిమసియయ్యె
వసిగొని సన్న్యాసివామనమఠము - వసదిమంటపమును బసుమానఁగలసెఁ
గుశదర్భపిన్నయ్యకొంప పైఁజిచ్చు - నశనంబువారియి ల్లది యందికొనియె
నీడాడ యననేల యిన్నియు మడిసెఁ - గూడఁగ శివదూషకుల యిండు లనుచుఁ
బ్రళయాగ్నిలోనార్చు ప్రమథులయట్టు - లలరి భక్తానీక మార్వఁగ ద్విజులు
మసలి యిండులతోన మడిసెడువారు - వెసనేఁగుదెంచుచు [1]వెండీల్గువారు
తలలం[2]టుకొని కాలఁదల్లడపడుచు - నిల గుళ్లలోపలి కేఁగెడువారు
గడ్డము ల్మీసలు గమరంగ నచటి - గడ్డిగబావులు గని యుర్కువారు
చీరలు దరికొనఁజిడిముడిపడుచు - మారారిభక్తుల మఱువుగొన్వారు
మించఁగాలకమున్న మృడుభక్తులిండ్లఁ - బంచలఁ బెరడులఁబొంచుండువారు
తనువుల శిఖి దరికొని కాలఁగాలఁ - జని చని భక్తుల శరణనువారు
పఱుపకమును బిబ్బ బాచయ్యగారి - పిఱుఁదన నిల్చి యుబ్బఱి మ్రొక్కువారు
చిచ్చునవెడవెడ వెచ్చుచు సగము - సచ్చియు నిబ్భంగి సగము సావకయుఁ
బప్పుకేశవభట్టు దొప్పన పెద్ది - తప్పకం టైతన బొప్పనత్రేది
సింగరా జాదెన చిప్పనకూచి - మంగన ఘడిసాసి నంగన్నపిన్న
దబ్బరాదిత్యుండు సబ్బనయ్యయును - గబ్బుమైలారుండు సుబ్బనమంచి
యడ్డగాలైతన దొడ్డనకూచి - బొడ్డు రాఘవభట్టు గడ్డము పెద్ది
వీరాదిగాఁగ గొబ్బూరిగ్రామణులు - మారారిభక్తుల మాకు దిక్కనుచుఁ

  1. వేనీల్గు
  2. దుకొనికాల్వ