పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

బసవపురాణము

వత్తురే యన్యదైవంబులయిండ్లు - చొత్తురే భక్తులు సూతురే విండ్రె
లింగైకనిష్ఠావిలీనుండు భృంగి - యంగజారాతికి నతివ యైనట్టి
యర్ధనారికి మ్రొక్కక భవునిదక్షి - [1]ణార్ధ మేర్పఱిచియు నటమ్రొక్కెననిన
నిట వేయునేల మాహేశ్వరవితతి - చిటిపొటివేల్పులఁజీరికిఁగొండ్రె
వినవె ఘంటాకర్ణుఁడను ప్రమథుండు - మును పరశబ్దంబు విననినేమంబు
గాన ఘంటలు ఘణఘణయని మ్రోయ - వీనుల నొకవేనవేలు ధరించి
లోకంబులందు ఘంటాకర్ణుఁడనఁగఁ - బ్రాకటంబుగఁజెప్పఁబడియె వెండియును

అరియమ కథ


[2]నదియట్టు లెఱుఁగవే యరియమనాఁగ - మొదల నర్వద్దాడి మువ్వురలోన
వెలయ మహేంద్రమంగళ మనుపురిని - నెలకొన్న సద్భక్తినిష్ఠ పెక్కువను
దనయొద్ద నొండొకదైవంబుఁబేరు - కొనువారి తలఁదెగఁదునుముదు ననుచు
నున్నెడ నింటికి నొక్క బ్రాహ్మణుఁడు - సన్నుతి రుద్రంబుఁజదువుచు వచ్చి
భిక్షంబు వేడుడుఁబ్రీతిమైఁ దాన - భిక్షంబు గొనివచ్చి పెట్టంగ నురిలి
యందులో నొకమెదు కవనిపైఁబడ్డ - సందడింపుచు నన్యశబ్దంబుఁబలుకఁ
గట్టుగ్రమునఁజేతిచట్టువంబునను - గిట్టి యాభూసురు పొట్ట వ్రచ్చుడును
“నక్కటికము లేక యరియమనాఁగ - నొక్క భక్తుఁడు సంపె నొక్క విద్వాంసు
'ధర బ్రాహ్మణో న హంతవ్య' యనంగఁ - బరగిన వేదోక్తిఁబరపరసేసి
స్వాధ్యాయపరుఁడగు సద్భ్రాహ్మణుండు - వధ్యుఁడే యూరక వధియింపఁదగునె
యడుగ భిక్షంబు వెట్టెడిది గాదేని - గడపెడి దింతియకాక చంపుదురె”
యనుచు భూసురు లాగ్రహంబునఁగూడి - జననాథునకు నంత వినిపింపఁదడవ
యప్పుడ పిలిపించి యరియమరాజుఁ - “[3]దప్పేమి మునుజేసెఁజెప్పుమా విప్రు
నేలచంపితి నీతియే యింత బుద్ధి - మాలుదురే భక్తి మదిఁగల్గు ఫలమె
చెప్పు కాచెద మేమి[4]సేసె నాతండు - చెప్పవేనియు సరిసేసెద మిట్లు
చెల్లునే' యనవుడుఁజిఱునవ్వు నవ్వి - “చొల్లువాఱుడుమాటలెల్ల నేమిటికిఁ
జంపితి నట్లైనఁజంపినవిధము - చంపంగఁ దగుతప్పు శంభుఁడ యెఱుఁగుఁ
గావఁజంపఁగఁగర్త దేవుఁడ కాక - కావఁజంపఁగ మీరు గర్తలె” యనుడు

  1. ణార్థంబయేర్పఱచట
  2. అదియెల్ల
  3. తప్పేమిసేసె నీ విప్రుఁడుసెపుమ
  4. సేసి నాఁడతఁడు