పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

బసవపురాణము

సిద్ధంబు వేదవిరుద్ధంబు జైన - బౌద్ధచార్వాకదుష్పథ సమయములు
మూఁడును నిర్మూలముగఁ జేయు దనుక - మూఁడు ఱాలనువైతు ముప్ప్రొద్దునిన్ను
నిది నిజవ్రత” మంచు నిలఁబ్రవర్తింప - నది వెల్లివిరిసి [1]యేన్నాళ్లు వాఱంగ
గుడి కేఁగరామిని గుదగుదమనుచుఁ - గుడువక [2]యేన్నాళ్లు గడచినపిదప
నేఱు డొంకిన గుడి కేఁగియు “లెక్క - నేఱ నేమిటికి ఱాలెన్ని వైచినను
మిసిమింతుఁడవు గావు మృడ! దేవ! యేను - విసివితి నివియేల వేయును నింక
నీ యొక్కటియె చాలుఁ బో” యని పెద్ద - ఱా యెత్తికొనిపోయి “కో” యని వైవ
శివలింగ మంతలోఁజేతులు సాఁచి - యవుదలఁబడకుండ నాఁగి నవ్వుచును
“మెచ్చితి వరము నీ కిచ్చితి నడుగు - మిచ్చ యెయ్యది” యన నిలఁజాఁగి మ్రొక్కి
"హరియును బ్రహ్మయు నాది నంత్యంబు - పరికించి కానని యురులింగమూర్తి
వేనవేల్విధముల వేదంబు లరసి - కానక వెదకెడు ఘనలింగమూర్తి
సకలసిద్ధాంతశాస్త్రపురాణయుక్తి - నిక మిట్టి దనరాని నిజలింగమూర్తి
సనకసనందనమునిముఖ్యవితతి - మనములు గడచిన మహలింగమూర్తి
శేషవాసుకి బహుజిహ్వోక్త వినుతి భాషలు గడచిన పటులింగమూర్తి
కంటి మీ శ్రీపాదకమలంబు లేను - మంటిఁజాలదె నాకు మఱియొం డదేల?
మల్లెమొగ్గల వైవ మదనుని వేఁడి - [3]వెల్లఁగాఁజేసితి దెల్లంబుగాదె
ఱాలవైచినఁగరుణాలోకనమునఁ - బాలించితివి భక్తిపరునిగా నన్ను
నన్యాయమున నీకు సహితంబు సేయ - ధన్యత్వ మీగి సోద్యము గాదె జియ్య!
స్తుతియును నిందయు హితము సహితము - మతిఁదలంచినను సమానము ల్గావె
భక్తవత్సల! భక్తపరతంత్ర! భర్గ - ముక్తివల్లభ! దయామూర్తివి గాన
నిందించి నంబన్న నీ గుణకీర్తిఁ - జెంది మల్హణుఁడును జేరరె నిన్నుఁ
గావున నన్ గటాక్షప్రేక్షణమున - భావించి యీ ఱాయి వూవుఱాయిగను
అలవడ నీయుత్తమాంగంబుదెసను - నెలమి నుండఁగఁజేయు మెల్లగుళ్లందు”
ననుచు నవ్వేద[4]బాహ్యంపు మార్గములు - దునిమివైవఁడె సాంఖ్యతొండండు జైన!

కోవూరి బ్రహ్మయ్య కథ


మఱియుఁగోవూరి బ్రహ్మయ్య నాఁగ నొక్క - గఱకంఠుభక్తుఁడఖండితకీర్తి
జినమునులకుఁదనకును దర్కమైన - జినసమయుఁడు వాదమున సిగ్గువడియు

  1. మూ
  2. మూ
  3. వెల్లగాఁజేసిన వేల్పవునీవు , తెల్లంబుగాఁగ
  4. బాహ్యపుసమయములు