పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

179

యల్ల పాడ్గుడిలో సహస్రదీపంబు - లెల్లెడ ముట్టించు[1]నిది నిజవ్రతము
నీయూర నితనికి నెవ్వరు నెయ్యి - వోయకుండినఁదాన పోయెడిఁగాక
యంచు నాలోచించి యతనికి ఘృతము - నించుకయును బోయ నీకున్న వచ్చి
“ప్రాణేశ నేయి యెప్పాటనులేదు - ప్రాణము ల్విడుతు దీపంబు లాఱినను”
అంచుఁబరిచ్ఛేది యగుడు నద్దేవుఁ - డంచిత ప్రీతిఁబ్రత్యక్షమై నిల్చి
"వరదసోమయ యర్ఘ్యపణ్యంబులందుఁ - బరువడిఁదొల్లి దీపము లెత్తినట్లు
సజ్జనలీల మజ్జనబావిలోని - యజ్జలంబులు వోయ నలరు దీపములు
కానక యన్యాయకారులై యున్న - జైనుల పనులును జచ్చెడునేఁడ”
యని దేవదేశుఁడానతిచ్చుడును - విని మహానందసంజనితాస్యుఁడగుచుఁ
గొలనిజలంబులఁగోటిదీపంబు - లలరఁగ ముట్టించి యాడుచున్నెడను
నఱవంగ నొక్కవెయ్యయును లేకుండ - నఱిముఱిఁబసులెల్ల హతమైనఁజూచి
“యిదియేమి సోద్యమో యింతలోఁబసులు - మెదలవు గదలవు మృతిఁబొందె నల్ల
పాటిదేవరచేతఁబడసి దీపములు - కోటానఁగోటి యీకొలని నీర్వోసి
ముట్టించినాఁడటే యిట్టి చోద్యంబుఁ - బుట్టునె శివభక్తు లెట్టి [2]వారుండ్రొ?
యిట నెయ్యి వోయంగనీక యుండినను - గటకటా శాపించెఁగాక యత్తపసి
కాదేని [3]బిట్టబడ్గరఁబసు ల్సచ్చు - నా దీనఁదప్పేమి పోదండుగాక”
యనుచు నేతెంచి సాష్టాంగులై మ్రొక్కి - వినుతింపుచుండ నా ఘనకృపామూర్తి
పసుల ప్రాణం బిచ్చి పరగ జైనులకు - నొసఁగఁడే శివదీక్ష యోరి జైనుండ!

సాంఖ్యతొండని కథ


వెండియు విను సాంఖ్యతొండండు సోడ - మండలంబున శాంతమంగయన్పురిని
బౌద్దునికడుపునఁ బ్రభవించి మఱి ప్ర - బుద్ధుఁడై బౌద్ధవిరుద్ధసంగతిని
దొలుమేని తనపుణ్యఫలమునఁజేసి - వలగొని శివ[4]భక్తివాసన నిగుడ
“భక్తుండనైనను బ్రదుకంగ నీరు - భక్తుండఁగాకున్న బ్రదుకు [5] దానేల
యామటఁబదిటలింగార్చకుం డనెడు - నామంబు వినఁగరా దేమి కర్మంబొ?
యిట్టి భవద్భక్తిహీనుకడ్పునను - బుట్టింపఁదగునయ్య భూతేశ్వరుండ!
యేలయా నన్నింత యీశ్వర! కరుణ - మాలి పుట్టించితి మలధారియింట
నిండారుసద్భక్తి నిను భజియింప - నొం డుపాయమ్ము లే దొగి నట్లుఁగాక

  1. టిది
  2. భూనుతులొ, వార్గలరొ, వారలరొ
  3. కాడెబిట్టకబిఱ్ఱుగా
  4. తత్త్వ
  5. దాలేదు