పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

173

శ్రీపతినాథునాజ్ఞాపనఁజేసి - నాపగలూరికి నరిగి యక్కడను
నిలఁబంకమందున్న జలరుహమట్ల - వెలివాడనున్న నిర్మలసుచరిత్రు
గురుమూర్తిఁగదిసి యత్తిరునావకరిశుఁ - డరుదంద సాష్టాంగుఁడై మ్రొక్కి నిలువ
ముదమునఁదద్గురుమూర్తియు [1]నతనిఁ - బదపడి శివభక్తిపరుఁజేయఁదలఁచి
తనదు కృపావలోకనమాత్రఁ [2]జేసి - నొసలి దుర్లేఖలు [3]గసిమసి సేసి
శివతీర్థకలశాభిషేక మొనర్చి - సవిశేషలింగ[4] సంస్కార మొనర్చి
సంచిత శివహస్త సంగతుఁజేసి - పంచభూత [5]వికారపథమునఁబాపి
యంగలింగనియుక్తి మంగళక్రియల - సంగత[6]సత్యప్రసాదాంగుఁజేసి
విగతవాయుప్రాణవిధు లాచరించి - నెగడ లింగప్రాణనిష్ఠితుఁజేసి
సిద్ధమంత్రమునఁబ్రసిద్ధుఁగావించి - [7]శుద్ధాత్ముఁజిన్మయజ్యోతిఁగీలించి
వినుతజీవన్ముక్తికిని హేతువైన - యనుపమ శివరహస్యార్ధము ల్దెలిపి
తమ కరుణాప్రసాదముఁగృపసేసి - విమల సద్భక్తిసంవేత్తఁగావింపఁ
దిరునావకరిశియుఁదేజిష్ణులీలఁ - బరమశివాచార పారవశ్యమున
భవభక్తవితతికి భువిఁజాఁగిమ్రొక్కి - శివమహోత్సవములు సేయఁగఁబనిచి
వాహనవస్త్రసువర్ణాభరణ స - మూహార్చనక్రియ ల్ముదమునఁజలిపి
వలపారఁదన మనోవాక్కాయ కర్మ - ములఁ బ్రాణదేహార్థముల నివేదించి
భూతిరుద్రాక్షవిభూషణపరమ - పూతవ్రతస్థుఁడై భువిఁబ్రవర్తింప
"నన్యదర్శనమార్గుఁడయ్యె వీఁ"డనుచు - నన్యాయమున జైను లందఱు నతని
[8]గరికిఁబెట్టుడు భద్రకరి ముట్టనోడెఁ - గరిచర్మధరుబంటుఁగరి యేమిసేయు?
విషము వెట్టుడుఁగుడ్చి విజయుఁడై నిలిచె - విషసంహరునిబంటు విషమేమిసేయు?
[9]బహ్వగ్నిఁద్రోవఁబైఁబడ నాఱె వహ్ని[10] - జిహ్వాంతకునిబంటుఁజిచ్చేమిసేయు?
జలముల ముంపుడుఁజాలవు ముంప - జలమౌళిబంటును జల మేమిసేయు?
జంపంగ నేక్రియఁజాలక తమ్ముఁ - జంపునో యితఁడని శరణుసొచ్చుడును
గంటకులగు జైనకర్ములఁగాచి - తొంటిలాంఛనములు దుడిపించి యంత
రుద్రాక్షభసితాదిరూపిత పంచ - ముద్రాధరులఁజేసి రౌద్రముతోడ
వెసజైనప్రతిమల విట [11]తాటమాడి - వసదులన్నియు వచ్చి వైపించెఁగాదె
లలి జైనసమయకోలాహలుఁడనఁగఁ - గలుగు మా తిరునావకరిశి దేవుండు

  1. నంత
  2. నతని
  3. గసిబిసి
  4. సంస్కారుగాఁ జేసి
  5. శరీరబంధంబు
  6. సద్యః
  7. శుద్ధాత్మఁజిన్మయ
  8. కరినిగొల్పుడు
  9. బ్రహ్మాగ్ని...
  10. జిహ్వా
  11. తటమార్చి