పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

బసవపురాణము

[1]ననలంబుమీఁదను నలరెడు శిరము - ననలంబు మ్రింగుచు నటయుండుశిరము
బొబ్బిడుశిరమును నుబ్బెడుశిరము - గుబ్బనఁబడి తద్ద గునిసెడుశిరము
నాలుక ల్గ్రోయుచునలి గొనుశిరము - శూలిని వెక్కిరించుచు నుండుశిరము
నుఱికుర్కిపడుశిర మొఱగెడుశిరము - మఱియు సంధిల్లుచు [2]మఱపడుశిరము
పొగడెడుశిరమును నగియెడుశిరముఁ - దెగడెడు శిరమును దీవించుశిరము
శరణనుశిరమును జయవెట్టుశిరము - సరసమాడుశిరముఁజదివెడుశిరము
[3]మలరెడుశిరమును మార్కొనుశిరము - [4]దలఁకకీశ్వరుతోడఁ దాఁకెడుశిరము
'బా'పనుశిరమును బాడెడుశిరముఁ - 'జాపంద'యని శివు జంకించుశిరము
నిప్పాటఁ [5]బసికమై నీశ్వరుఁబూన్పఁ - గుప్పలుగొని తల ల్గుడిఁబిక్కటిల్ల
మారారి విస్మయమానసుం డగుచు - “నోరోరి! వంక! నా కూరుపు వోదు
ఓడితినన్నను మేడెమువొడువఁ - బాడియే నీ వీరభక్తికి నిలువ
నా వశంబే?” యని దేవదేవుండు - నావంకతందె శ్రీహస్తంబు వట్టి
యనురాగమునఁబొల్చు నత్తలలెల్లఁ - దన లింగమూర్తిలోనన ధరియించె
శంకించుచును నరు ల్సంస్తుతి సేయ - వంకయ్య శివునిమాఱంకమై గెలిచె
నిటువంటి భక్తు లనేకులు గలరు - కుటిలాత్మ! విన నీకుఁ గొలఁది గాదెట్లు
నెఱుఁగవే తొల్లి మీయెడ్గడవారిఁ - బఱపిన మా శివభక్తుల మహిమ;

తిరునావుకరశు కథ


తిరునావలూరను పురిఁదిరునావ - కరిశుండనఁగ జైనగురుఁడొక్కరుండు
జినసమయాచార్యుఁడనఁజనునట్టె - మును శూలకుట్టెత్తి మూల్గుచు నేలఁ
బడి పొరలుచుఁబ్రాణపరితాపమందు - నెడ వారి [6]తోఁబుట్టు వేతెంచి చూచి
“యీ మంత్రతంత్రలూలామాలములను - నో మలదేహి! నీ కుడుగదు నొప్పి
బ్రదుకంగవలతేని భక్తసమ్మతిని - మదనసంహరు దివ్యమంత్రంబు గఱవు
వేగంబ నీకు నీ రోగమయ్యెడును - రాగిలి యీప్సితార్థములు వొందెడిని”
ననవుడు “భక్తుండ నయ్యెదనింక - ననుమాన మొక్కింతయును వల” దనుచు
శపథంబు నేయుడుఁజయ్యన నతివ - త్రిపురారిభక్తులఁదివుటఁదలంచి
యనుపమదివ్యపంచాక్షరీమంత్ర - మున భసిత మలంది మొల దిగఁదుడువ
శూలకుట్టుడుగుడుఁజోద్యంబు నొంది - యా లలనకు నతఁడష్టాంగమెరఁగి
“పడఁతి! నీకతమున బ్రదికితి నింక - నడర భక్తుండనే నయ్యెద” ననుచు

  1. ఈ రెండుపాదములు నొకప్రతిలోఁగలవు
  2. మఱుపడు
  3. మలసెడు
  4. దలర
  5. బసిగమై
  6. తోబుట్టుగే