పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

169

హరభక్తవితతియు [1]నరుదెంచి [2]చూడ - "నరు”దని పొగడ జొమ్మయ్య వీక్షించి
“పృథుగురుధ్యాన మన్బిందివాలమునఁ - బ్రథితసంసారమున్ పంచాస్యుఁద్రుంచి
మును భక్తదర్శనం బను ముద్గరమునఁ - జనుపురాకృతకర్మమను దుప్పిఁజంపి
గుర్వాజ్ఞ యనుకత్తి కుంతంబునందుఁ - బూర్వాశ్రమంబను పులిఁబడఁబొడిచి
సుజ్ఞానమను వాఁడి సురియఁ జేపట్టి - యజ్ఞానమను వరాహంబుఁజెండాడి
యాయతి సద్భక్తియను తోమరమున - మాయాప్రపంచ మన్మనుఁబోతుఁ [3]దునిమి
వినుతశివాచారమను కుఠారమున - జినలోకపథమను చివ్వంగిఁజదిపి
విమలప్రసాదమ న్విల్లు పూరించి - భ్రమితేంద్రియము లనఁబడు నిర్లనేసి
భాషాప్రణీతమన్బడు బల్లగోల - నీషణత్రయమను నెలుఁగు కన్నొడిచి
హరమహత్త్వంబను నడ్డాయుధమునఁ - బరవాదులను మృగోత్కరముఁగీటడఁచి
వెలసిన యా [4]బలువేఁటకానికిని - నిలమృగంబులఁజంపు టిదియెంత వెద్ద
యదిగాక పరికింప నరుగుచో నతని - పదఘట్టనలఁ జచ్చు బహుజంతువులకు
నగు మోక్షమనిన జొమ్మయ్యచేఁజచ్చు - మృగము లేఁగుట సోద్యమే శివపురికి”
ననుచు నబ్బసవయ్య యర్థిమైఁబొగడ - ఘనకీర్తిఁ గళ్యాణకటకంబునందుఁ
జోద్యతరంబుగా జొమ్మయ్య సిరస - ముద్యద్గుణాంకుఁడై యుండెఁదెల్లముగఁ
దెలుఁగు జొమ్మయ్య నిర్మలచరిత్రంబు - నలవోకఁజదివిన నర్థిమై విన్న
[5]రాజ్యాభిషిక్తుఁడై రంజిల్లుఁబ్రీతిఁ - బూజ్యత [6]లింగసామ్రాజ్యంబుఁబొందు
సారజంగమపాదసరసిజయుగ్మ - ధారాళమకరందధౌతశిరస్క!
శారదనీరదహారనీహార - తారామరాహారధౌతయశస్క!
యంచితకర్ణరసాయనకల్ప - సంచితపరిపాకసత్యవచస్క!
మహనీయరుద్రాక్షమాలికాభూతి - విహితమండనకాంతి విలసదురస్క!
సంగాఖ్య! సమసుఖసదమలప్రాణ - లింగనిరంతర లీనమనస్క!
ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ - సంగతసుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగఘనకరస్థలి విశ్వనాథ - వరకృపాంచితకవిత్వస్ఫూర్తిఁబేర్చి
చను బసవపురాణమను కథయందు - ననుపమంబుగఁబంచమాశ్వాస మయ్యె.

  1. ననయంబు
  2. చూచి-య
  3. ద్రుంచి
  4. నెఱ
  5. రాజితభక్తి సామ్రాజ్యంబు నొందు
  6. నభిమతభోగముల్ గలుగు