పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

బసవపురాణము

ముసిఁడి చౌడయగారి యసదృశచరిత - మసలార వినిన నత్యర్థి వ్రాసిననుఁ
జదివిన సద్భక్తిసంపద లొందు - మదనారికరుణఁబ్రమథలీల దనరు

సురియ చౌడయ్య కథ


వరకీర్తి సురియచౌడరసునా మఱియుఁ - బరికింపఁగారణపురుషరత్నంబు
లింగ[1]ధర్మజ్ఞాని లింగాభిమాని - లింగయోగానంద సంగతాత్మకుఁడు
గాఢవీరవ్రతారూఢప్రతాపి - గూఢలింగైక్య నిరూఢమానసుఁడు
ఉభయలింగప్రసాదోపభోగుండు - త్రిభువనపూజ్యుండు శుభకరకీర్తి
శుద్ధాంతరంగప్రబుద్ధుండు గతవి - రుద్ధకర్మేంద్రియబుద్ధీంద్రియుండు
సదమల [2]కీర్తి భాస్వత్పుణ్యమూర్తి - సదయాత్ముఁడపగతసంసారభయుఁడు
శిష్టమహోత్కృష్టశీలపాలనుఁడు - ఇష్టాష్టవిధభక్తిపుష్టి చేతనుఁడు
కాయనియుక్తవికారదూరుండు - మాయాప్రపంచావిధేయవర్తనుఁడు
నన విలసిల్లి కళ్యాణంబునందు - ననయంబు నేఁడు నాఁడనక ముప్పొద్దు
భంగిగా సద్గురుభావంబు నందు - జంగమకోటి కర్చనలు సేయుచును
బాయసాహారముల్ పంచభక్ష్యములు - నాయతభక్తిదివ్యాన్నపానములు
డెక్కొనగూడ వడ్డించి సంప్రీతి - మ్రొక్కి కరాంబుజంబులు దలమోపి
“పాయక శ్రుతి[3]రసా న్భక్తస్యజిహ్వా - గ్రే” యని యేప్రొద్దు మ్రోయుఁగావునను
నారంగ నీ జంగమావతారమున - నారగింపవె దేవ!” యని విన్నవించి
జంగమం బారగింపంగఁదానంత - లింగార్చనక్రియాసంగతి నిలిచి
పొరి మజ్జనోదకంబులకట మున్న - పరముపై నానందబాష్పముల్ దొరుగఁ
బూజించు నవపుష్పరాజికి మున్న - రాజాంకుపై హృత్సరోజంబు విరియ
ధూపవాసనకు మున్ ధూర్జటి మ్రోల - వ్యాపితాంతర్గతవాసన దనర
వెలుఁగు నీరాజనంబుల కటమున్న - మలహరునంద యాత్మజ్యోతి ప్రబల
వినివేదితపదార్థవితతికి మున్న - తన ప్రాణపద మీశ్వరున కర్పితముగ
లింగార్చనము [4]దాను బొంగి చేయుచును - నంగచేష్టలకు నంతంతఁబాయుచును
సుభగలింగముఁజూచిచూచిక్రాలుచును - నభవామృతం బాని యాని వ్రాలుచును
సురుచిరోక్తుల సోలిసోలి పాడుచును - స్థిరసుఖాంబుధిఁదేలి తేలియాడుచును
మంగళోన్నతబహిరంగంబు నంత - రంగంబుఁదనప్రాణలింగస్థ మగుచు

  1. మర్మ
  2. స్ఫూర్తి
  3. "భక్తజిహ్వాగ్ర - కేయని” అని దిద్దిన గణము కుదురును
  4. బొంగిపొంగి