పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

బసవపురాణము

బాపు! భాగ్యప్రాణి! బాపు! కృపాత్మ! - బాపురే! ధనవంత! బాపు! కీర్తీశ
నల్లవో బసవయ్య నా కిచ్చినట్టు - లెల్లభక్తావళికి నిత్తయ్య! తొల్లి
మడివాలు మాచయ్య మనుమల మమ్ము - విడువక నడుపుకో వేయును నేల?”
అని పెక్కు భంగుల నాలి సేయంగ - ఘనతరశోకాంబు కలితాస్యుఁడగుచుఁ
“గనకాద్రియరయునే కాకిగుణంబు - నినుముగుణ మరయునే పరుసంబు
గుణనిధి వీవు దుర్గుణనిధి నేను - గణుతింపఁగలదె సద్గుణము నా యందు
వెలివాడఁగలుగునే వేదఘోషంబు - నిల నావమునఁగల్గునే [1]రాగిముంత
తలఁపఁగుంపటిలోనఁదామరదుంప - మొలచునే యిన్నియు ముదలింప నేల
గతవివేకునిఁగావఁగాఁదగు నీవ - గతి దయాభావ! సంగయదేవ!” యనుచు
మారయ్య పాదపద్మంబుల కెరఁగి - సారాంచితోక్తుల సంస్తుతింపుచును
నభయంబు వేఁడుచు నడుగులమీఁద - సభయాత్ముఁడై యున్నఁ [2]జయ్యన నెత్తి
యసలారఁగౌఁగిట నందంద చేర్చి - బసవని కారుణ్యరసవార్ధిఁదేల్చి
యలరంగ మృదుమధురాంచితాలాప - ములఁబ్రబోధించుడు నలి దులుకాడ
మారయ్యగారికి మఱియును మ్రొక్కి - యారఁగ బసవరా జరిగె; నంతటను
మోళిగ మారయ్య ముందటియట్ల - లాలితభక్తిసల్లీలమై నుండె;
నారఁగ మోళిగ మారయ్యగారి - చారుచరిత్రంబు సదివిన విన్న
నిత్యప్రసాదవినిర్మలాత్మీయ - సత్యసుఖంబులు సల్లీలఁగలుగు

కన్నడ బ్రహ్మయ్యగారి కథ


పరగంగఁగన్నడ బ్రహ్మయ్య నాఁగ - ధర నొప్పు సద్భక్తిపరుఁడు వెండియును
దర్పితసంసారదళనుండు జంగ - మార్పిత ప్రాణదేహార్థాభిమాని
యద్భుతచరితుఁడుద్యద్భక్తియుక్తి - సద్భావనోపేత చరలింగమూర్తి
సారవీరవ్రతాచారుండు జంగ - మారాధకులలోన నగ్రగణ్యుండు
సంచిత బాహ్యపూజాపరతంత్రుఁ - డంచితాంతస్సపర్యాపరాయణుఁడు
నిరవద్యహృద్య వినిర్మలభక్తి - పరతంత్రుఁడన లసచ్చరితఁబెంపారి
కత్తియు బలపంబుఁ గావిచీరయును - గత్తెర యిసుము నక్షతలును ముండ్ల
బంతియు నీలికప్పడమును ద్రిండు - [3]మంతరకాటుక మఱి చండవేది
సెలగోల యొంటట్ట చెప్పులుఁ [4]బీఁకె - యొలుకులబూడిదయును వాటుఱాలుఁ

  1. చెంబుచిట్టి
  2. జక్కన
  3. మంతకాటుకయును
  4. పీఁక, క్రొత్త