పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

బసవపురాణము

నగరోపకంఠంబునను మోపువైచి - దిగదిగఁబోయి తాఁదెచ్చినక్రమము
వచ్చిన దాదిగా వార్తయుఁబూస - గ్రుచ్చినయట్లుగా గురువుగాఁజెప్పి
బసవన్న! కలకేతబ్రహ్మయ్య మాకు - నొసఁగినర్థము మోవ నొకఁడ నేనోపఁ
బనుపవే వేఱొక్కవరిచారు మాకు” - ననవుడు బసవఁ డత్యాశ్చర్యమంది
“యిట్టివా రగుదురే యీశ్వరభక్తు - లెట్టున్న వారల నేమనవచ్చుఁ?
గాయకం బలరంగఁగలకేతవిద్య - యాయయ్యమహిమ దా నతివిస్మయంబు
కల్పవృక్షం బీగి ఘన మందమేని - యల్పభోగమకాక యపవర్గ మెద్ది?
చింతామణులయీగి [1]చెప్పుదండేని - చింతింప శాశ్వతసిద్ధి యందెద్ది?
మేరువుఁజెప్పుదమే పైఁడిదక్కఁ - గోరి యందొకటైనఁగొనఁదినఁ [2]గలదె?
కామధేనువు నిత్యమే మున్ను దాను - కామించువారికిఁగార్యముల్ సలుపఁ
గల కేతబ్రహ్మయ్యగారి మహత్త్వ - మిల గారవింపంగ నిన్నిటికంటె
నతులితలీల సర్వార్థసిద్ధులకు - నతిశయస్థితిహేతు వగుచున్న యదియుఁ
గిన్నరబ్రహ్మయ్యఁ గీడ్పడఁ బలుకఁ - జన్నె యొండొరుల కాశరణుండు దక్కఁ
గానోపు నతఁడు సాక్షాత్సంగమేశుఁ - [3]డేనాఁటి కితరుల కేల చొప్పడును
దనుఁజూప కిబ్భంగి ధరణి వర్తించు - ననువుగా కతఁడేమి యల్పుఁడే” యనుచు
భక్తునకును దోడు వరిచారు నిచ్చి - [4]వ్యక్తసందర్శనాసక్తి నేతెంచి
బసవఁడు కలకేత బ్రహ్మయ్యగారి - కసలార నందంద సాష్టాంగ మెరఁగి
యంజలీకృతకరకంజుఁడై నేత్ర - సంజనితానందజలరాశి [5]మునిఁగి
యెసక మెక్కఁగ నుతియించుచు నున్న - బసవనిఁగలకేత బ్రహ్మయ్య యనియె
“బసవ! [6]యీ కిన్నర బ్రహ్మయ్య భువిని - బసరింపఁగా నిట్టి భక్తుండు గలడె?
ఒడయనంబికి మున్ను వడిపెట్టు శివుఁడు - పడివెట్టు గిన్నర బ్రహ్మయ్య కిపుడు
పలికించుటయు నిత్యపడిగొనుటయును - వెలయ నయ్యిరువురవృత్తి [7]యోకాక
ముట్టఁగొల్చిన ఫలం బిట్టుండ వలదె? - వట్టిమాట [8]లవేల వలయు వస్తువులు
నిటలాక్షు [9]వేఁడక నిక్క మున్నవియె? - కటకటా! మే మింతగాలంబుఁ గొలుచు
టక్కటా! నిష్ఫలం [10]బయ్యె నిత్యంబు - నొక్కొక్క వాతికయును గొనలేదు
శివపూజఫలము సేసేతఁగొన్నట్లు - [11]తవిలి యాతనికి నంతన సమకూఱెఁ
బున్నెంబు మాలినపొ(డు?) వలమెల్ల - నెన్నంగ నున్నార మే మేమి గొఱయు

  1. ఁజెప్పుదంటే
  2. నేది?
  3. డేనాటని
  4. వ్యక్తి
  5. దేలి
  6. మి
  7. యుకాక
  8. లు నేల
  9. నడుగకఁ, గొల్వక
  10. బయెశివపూజ - యొ
  11. భువిమముబోంట్లకుఁ బొందంగఁదరమె?