పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

143

నంత వినోదార్థమై యొక్కనాఁడు - సంతోషచిత్తుఁడై చని కిన్నరయ్య
యాపురంబునఁద్రిపురాంతకదేవు - గోపురాంతరమునఁగూర్చున్న యెడను

గొఱియ కథ


వారాంగనార్ధమై వధియింప విలిచి - కోరి మిండం దొకగొఱియఁజేపట్టి
యవ్వీథిఁ జనఁ[1]ద్రి(ది?)వ్వంగఁ ద్రాడు - ద్రెవ్వుడు గొఱియ దద్దేవాలయంబు
పఱతెంచి సొచ్చుడుఁ [2]బైపడి వాఁడుఁ - బఱతేరఁ గిన్నరబ్రహ్మయ్య గాంచి
“పోవక నిలునిలు బొప్ప! యీ గొఱియ - దేవాలయముఁజొచ్చెఁ జావున కోడి
యింకఁజంపుట దోస మిట్లుగాదేని - కొంకక వెల సెప్పి కొను[3]ము రెట్టైన
మృడుభక్తు లొప్పింతురే శరణన్న - జడనరులైనను జంపంగనీరు
చరజీవులకు నెల్లఁజావును నొప్పి - సరియకాదే యెందుఁజర్చించిచూడ
నీకు దీనినిఁ జంప నేమమే! చెపుమ - యాకాంత దీని[4]నే యచ్చొత్తినదియె?
పడయరానిది భువిఁబసిఁడియకాదె? - కడుఁగాక మాడైన నడిగిన నిత్తు
నదె కొమ్ము" నావుడు "నక్కటా! యిట్టి - చదురుండుఁగలఁడయ్య జగతిలోపలను
గుడిసొచ్చు [5]మడిసొచ్చు గుండంబుసొచ్చు - విడుతురే గొఱియల విలిచినవారు?
త్రోవ నదెట్టులు దొలఁగకవచ్చు? - నీవకా కిబ్బువి నీతిమంతుఁడవు -
ఎఱుఁగమే మెన్నఁడు నిటువంటి వెందుఁ - గొఱగాదు దడసినఁగోపించు లంజె
'పెట్టెద వెల' యని బిగిసెడుఁ బెద్ద - ఇట్టి దయాపరుఁడెచ్చోటఁగలఁడు?
చరజీవులకునెల్లఁ జావును నొప్పి - సరియె తా ననియెడుఁజర్చింపనట్ల
మనుజుల ప్రాణంబు మఱి వేయుమాడ - లననేల యిన్నియు నతఁడు బొంకెడినె?
వేయిచ్చియైనను విడిపించు [6]గొఱియ - యీయయ్య [7]సంపఁగనీఁడు వొ” మ్మనుచుఁ
బోవవచ్చిన “బొప్ప! పోవకు” మనుచు - వేవేగఁదెప్పించి వేయుమాడలను
నిచ్చి"బొంకినఁ బోవనీఁజుమ్ము [8]రోరి! - యచ్చొత్తి విడుతు నే నటమీఁదెఱుంగ”
ననవుడు 'నౌఁగాక' యని మాడలెన్ని - కొని లంజెయింటికిఁజనిచని మగిడి
“గొఱియలేకున్నఁ బెద్దఱికమే?” యనుచు - మఱియొక్క గొఱియఁ గ్రమ్మఱవిల్చికొనుచు
బోయినఁజొరనీక పొలఁతి గోపించి - "చా! యెట్టిమిండఁడ చనుసను మింక
సరివిటుల్ నవ్వంగఁజక్క నా యిల్లు - చొర సిగ్గుగా దెట్లు శూన్యంపుగొల్ల!

  1. దెవ్వఁగా
  2. బరువడి
  3. మిన్మడైన
  4. పైన
  5. గిడి
  6. గాని
  7. గొనిపోవ
  8. గొఱియ-న