పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

బసవపురాణము

ఎణుమూర్తి నైనారు కథ

లీలమైఁదన ప్రాణలింగంబునకుఁద్రి - కాలంబునందును మేలిచందనము
ననురక్తి నియతిగా నర్పింపుచుండ - ధనమెల్లఁజందనంబునకు సమయుడుఁ
గడులేమి వుట్టిన గంధ మెబ్బంగి - గడియింపఁజాల కయ్యెడ నిర్ణయించి
[1]తలఁపఁగ నేల దాఁగలిమియు భక్తి - కలిమిగా కర్థంబు కలిమియే కలిమి
నా మనంబునఁదెంపు లేమియే భక్తి - లేమిగా కర్థంబు లేమియే లేమి
తనువుండ మనసుండఁదల్లడం బంద - నను మెచ్చునే ప్రాణనాథుఁడీశుండు
తనువెల్లఁగూడ గంధముగాఁగఁదిగిచి - యనుష(ర)క్తి నిత్యంబు నర్పింతు నింక
నెత్తురు వెడలిన నిగ్గు దేరినను - నిత్తఱిఁదనుగుణం బింతసూపినను
మెఱుఁగు లేవడియైన మించు సడలిన - నెఱిఁజందనమునకుఁగొఱఁత దోఁచినను
జాయ దప్పిన నెఱి సామాన్యమైనఁ - బూయుచో [2]నురలినఁబొలుపు [3]గందినను
గంపొండు వలచినఁగడలు గట్టినను - గెంపు దక్కువయైనఁగ్రియ వెల్తియైనఁ
దనుపు లేకున్నఁ బూఁతకు రాకయున్న - నునుపు గాకున్న వాసనకుఁదేకున్న
మఱి కదా శివునకు మాకు నంకంబు - అఱిముఱితనమిప్పుడదియే!” యనుచు
ముదమున వలపలిమోఁచేయి సానఁ - గదియించి తిగిచి శ్రీగంధంబు వడసి
శివున కర్పించి భజించి మెప్పించి - భువి నరుల్ సూడఁజూడ విమానమెక్కి
మృడుపురంబునకు నప్పుడు బొందితోడ - నడచిన యెణుమూర్తినయనారిబంట

కడమలనంబి కథ


ప్రాణలింగమునకుఁబ్రతిదినంబునను - జాణత వెలయ నిజవ్రతంబుగను
గడు నర్థితోడ నఖండదీపంబు - లెడపక నిత్య వేయేసి ముట్టింప
నదియ నిమిత్తమై యర్థంబు సమయ - మదిలోన నొక్కనుమానంబు లేక
“తనువు దక్కంగ నర్థంబెల్ల సమసెఁ - దనువు నివేదించు తఱి యయ్యె నింకఁ
దలయును మేనును దరికొల్పి పెద్ద - వెలుఁగు వెట్టెద” నంచు వెండ్రుకల్ విచ్చి
జ్వలనంబునకుఁబట్టి శంభు మెప్పించి - వెలసిన యాకడమలనంబిబంట

గుగ్గులుకళయారు కథ


ఆసక్తిమై మహిసాక్షి ధూపంబు - బాసగా వెండియుఁబ్రాణేశ్వరునకు
నేఁడునాఁడనకుండ నిత్యనేమముగ - మూఁడుసంధ్యల ధూపముగ సమర్పింప

  1. తలఁకఁగ
  2. నురివి
  3. దప్పినను