పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

బసవపురాణము

ఒడయనంబి వాల్మీక దేవుని గుడికి వచ్చుట

నరుదందఁగా నంబి పరమనాచమ్మ - వరగృహంబున నుండి వాల్మీకిదేవు
గుడికి నేతెంచునయ్యెడఁబురజనులు - గెడగూడి త న్నిరుగెలఁకులఁగొలువ
సంతసంబున గ్రంతక్రంతల [1]నిఱికి - యంతంత జనులు ఘేయని జయవెట్ట
గద్యపద్యాద్యనవద్యకావ్యములు - హృద్యంబుగా సత్కవీశ్వరు ల్వొగడఁ
బరిహాసకుఁ [2]ల్సేరఁబాఠకుల్ బట్లు - వరగుణాంకనలుగైవారము ల్సేయ
గాయకు ల్దాళము ల్గదియించి మ్రొక్కఁ - బాయక తాపసప్రభులు దీవింప
వసిగొని వారికి వాంఛితార్థంబు - లొసఁగుచు నంతంత మసలి నిల్చుచును
బదనఖకాంతి భూభామవక్షోజ - పదకరత్నప్రభాప్రఖ్యమై వెలుఁగ
రాజిత[3]భూషణప్రభలు దిగ్గజశి - రోజమౌక్తికములరుచి నుల్లసిల్ల
నతులదివ్యాంగదీధితు లుదయార్కు - నతిశయాత్మజ్యోతిగతిఁ [4]బ్రజ్వరిల్ల
స్థిరదశనద్యుతుల్ శృంగారలక్ష్మి - వరముఖముకుర భాస్వరలీల వెలుఁగ
వరదృఙ్మరీచు లావాల్మీకిదేవు - చరణాబ్జరుచిరవిస్ఫురణఁబొల్పార
మకుటమాణిక్యాంశుమంజరు ల్సురగి - రి కలిత శేఖరాకృతిఁబ్రజ్వరిల్ల
వరవిటాకృతిఁ [5]బొల్చి హరు నిరవద్య - కరుణామృతాటోపకలితవారాశిఁ
దేలుచుఁ బసిఁడి బొందియకోల వట్టి - క్రాలుచుఁ గేరుచు సోలుచుఁగతులు
తడఁబడఁ ద్రొక్కుచు దండయిచ్చుచును - బడసిచూచుచు బయ [6]ల్వొడిచియాడుచును
సంగడికాండ్రను జప్పరించుచును - నంగ మెక్కంగ దిగంగఁజూచుచును
బొలఁతిభావము దలపోయుచు నాత్మ - విజయంబు మెఱయుచు విఱ్ఱవీఁగుచును
నెక్కుడువిటచేష్ట లేపార నెదిరి - లెక్క సేయక సుఖలీల నందంపు
సంబవు లిడుకొని సరసర నొడయ - నంబి సద్భక్తగణవ్రాతమునకు
మ్రొక్కక కరములు మోడ్ప కందంద - చిక్కక స్రుక్కక చక్కన వచ్చి
గుడిసొచ్చి తననిత్యపడి వేఁడికొనఁగ - మిడమిడిమిడుకుచు మిఱుమిండఁడనియె

ఒడయనంబిగర్వమునకు మిఱుమిండఁడు కుపితుఁడై వెలివెట్టుట


నోరి వీఁడెవ్వఁడు రా? రాజమౌళి - ధీరదిగ్గజములఁజీరికిఁగొనక
క్రొవ్వె! మా భక్తులకొలఁదెఱుంగండు - నవ్వాలుమీకేశుఁడడ్డమే తనకు
ఫాలాక్షుఁడలిగిన భక్తులు గావఁ - జాలుదు రట్టిద పోలగుఁగాక!

  1. నిలిచి
  2. ల్కేరఁ
  3. భూషిత
  4. దేజరిల్ల
  5. దాల్చి
  6. లొడసి. ల్డొడసి