పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxvi

భిక్షాటనము పూజ్యమైనవృత్తియైనది. గృహస్థాశ్రమమునందు విరక్తి ప్రబలినది. ప్రజలు నిరాశ్రయులై, సంఘశక్తి క్షీణించినది. బలములేని సంఘము స్వధర్మనిర్వహణమునకు నిరుపయోగమైనది. భగవద్భక్తిని సార్థకముచేయుటకు మానవసేవయే పరమసాధనముగ నున్నది. బసవేశ్వరుఁడు నిత్యజంగమార్చనలందు ఆత్మపూజను, శివపూజను, సంఘపూజను సాధ్యముచేసి, సంకుచితమైన భక్తిమార్గమును, సంఘజీవనమును విస్తరింపఁజేసి వీరశైవమును వీర్యవంతముఁ జేసెను. బసవేశ్వరుని రాజ్యాధికారము, ధృఢసంకల్పము, పరమశివభక్తి, త్యాగశీలము, కులనిరసనము, జంగమభక్తి, మాహాత్మ్యము వీరశైవవ్యాపనమునకు సాధకంబులై, బసవావతారము ప్రసిద్ధిని బడసినది. వీరశైవచరిత్ర బసవేశ్వరుని మహిమను వెల్లడిచేయుచున్నది.

కర్ణాటకాంధ్రభాషలందుఁగల వీరశైవవాఙ్మయమును బండితులు పరిశోధించి వీరశైవతత్త్వమును వ్యక్తముచేయుదురుగాక! వీరశైవాత్మకమైన బసవపురాణ మాంధ్రగ్రంథమాలయందు నాల్గవకుసుమముగ వెలయుచున్నది. ఈ సుప్రసిద్ధసోమనాథకృతికి స్వాగతం బొసంగి యాదరింప నాంధ్రలోకమును వేఁడుచున్నాను.

ప్రభవ సం. ఆశ్వయుజ శు. 3.

బుధవారము.

కా. నాగేశ్వరరావు.