పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxv

ప్రజాహృదయమును నిర్వీర్యము చేసి, నిర్జీవత్వముఁ బ్రబలఁజేసినవి. ఇట్టి విషాదస్థితియందు సంఘమునందు వీరశైవము చిత్కళాన్యాసమును జేసి మహాపరివర్తనమును గలుగఁజేసినది. శివభక్తిచిహ్నమైన లింగధారణము వీరశైవమును వీర్యవంతము చేసినది. వీరశైవమునందు గురుప్రసాదితములైన భక్తిభావనలు జంగమార్చనలందు సార్థకములై, భక్తిరసావేశమును గలుగఁజేసినవి. వీరశైవులైన లింగాంగులందఱు నగ్రజాంత్యజకులభేదములు లేక తీర్థప్రసాదములను గ్రహించుచు, శివస్వరూపులై శివసాయుజ్యమును బొందుచున్నారు. వీరశైవమునందు సిద్ధాంతమైన శివభక్తిప్రసాదము జంగమార్చనలందుఁ గ్రియారూపమున సార్థక మగుచున్నది. బసవపురాణమునందు మనోహరముగ వర్ణింపఁబడిన ప్రాకృతభక్తుల దివ్యచరితములు వీరశైవమతప్రతిభను విశదము చేయుచున్నవి.

బసవేశ్వరుఁడు

బసవేశ్వరుఁ డొకమహావ్యక్తి. బ్రాహ్మణకులజుఁడైన బసవేశ్వరుఁడు బ్రాహ్మణకులమును విడుచుట బసవేశ్వరుని దృఢసంకల్పమును వెల్లడిచేయుచున్నది. బసవేశ్వరుఁడు పరమశివభక్తుఁ డయ్యును, బిజ్జలునకు మంత్రిత్వమును, దండనాయకత్వమును వహించి రాజ్యభారమును నిర్వహించెను. బసవేశ్వరుఁడు తన సర్వస్వమును, రాజ్యాదాయమును, రామదాసు శ్రీరామమూర్తికి కైంకర్యము చేసినరీతిని, జంగమార్చనలకు సమర్పించుచుండెను. శివానుగ్రహమువలన బిజ్జలుని కోశమునందు ద్రవ్యమునకు లోటు లేకుండెడిది. అతఁడు భక్తులకుఁ దన భార్యనగలను, వలువలను సమర్పించి జంగమార్చనలం దిష్టలింగార్చనలను జేయుచుండెను. బసవేశ్వరుఁడు తాను మంత్రియను నహంకారములేక జంగమకోటులకు సముచితార్చనలను సలుపుచుండెను. అనన్యమైన జంగమభక్తి బసవేశ్వరుని త్యాగశీలమును విశదముచేయుచు బసవేశ్వరభక్తిని విస్తరింపఁజేసినది. వైరాగ్యసన్న్యాసోపహతమై జడమయమైన సంఘమునందు బసవేశ్వరుఁడు చైతన్యకళాన్యాసమును జేసి కర్మయోగప్రవృత్తి నుద్దరించెను.

జైనబౌద్ధులు కర్మసన్న్యాసులై సంఘమునందు వైరాగ్యమును వ్యాపింపఁజేసిరి. భక్తికి, ప్రజాగౌరవమునకు కాషాయాంబరములు చిహ్నములైనవి.