పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

బసవపురాణము

మడియించి యెడగాలఁబుడమికినూ(?)కి - మెడఁద్రొక్కి పెడబొబ్బలిడుచు ఘిఱ్ఱనఁగ
హస్తికుంభస్థలన్యస్తస్వకీయ - హస్తకుఠారుఁడై యట వ్రయ్యఁదివియ
శుంభద్గజేంద్రంబు కుంభినిఁ ద్రెళ్లె - దంభోళిచేఁ బర్వతము ద్రెళ్లినట్టు;
లిట చోళభూవిభుఁడింతయు నెఱిఁగి - యట వచ్చి యిఱువత్తు నడుగులకెరఁగి
నిటలాగ్రహస్తుఁడై నిలిచి భావించి - "కటకటా! భక్తునిఁ గారించె గజము
హరుభక్తులకు మున్నజాచ్యుతాదులును - సరియుఁ గారన్న నిక్కరిచావు సరియె?
ఏనుంగు వశువదియేమి దా నెఱుఁగు - నేనుంగు నేలిన యే ద్రోహిఁ గాక
చచ్చెద నా చావుసరి యన్న నోరు- వుచ్చు నట్లైనను జచ్చి శుద్ధుండ”
ననుచు నప్పుడ యిర్వదాండారిమ్రోల - జనపతి దన శిరంబునకుఁ దా నలుగ
నట్టిచో శివుడు ప్రత్యక్షమై చోళ - [1]పట్టవర్ధను భయభక్తియుక్తికిని
ఇఱువదాండారి మహిష్ఠభక్తికిని - గఱకంఠుఁడజుఁడు శంకరుఁడక్షయుండు
మెచ్చి భక్తునిప్రాణమిచ్చి మావంతుఁ - జెచ్చెర నపుడ సంజీవితుఁ జేసె
నంతఁబ్రాణము మత్తదంతికి నొసఁగె - యెంతయు మహిమ నయ్యిఱువదాండారి
నా చోడవల్లభు నతిదయాదృష్టిఁ - జూచి కైలాసవాసులఁజేసె శివుఁడు
మదియించి భక్తుని మడియించి నేనుఁ - గదియు నప్పుడ చచ్చె నా చోడనృపతి
ప్రేమం బెలర్పఁగ "భృత్యాపరాధ(?) - స్వామినోదండ” యన్చదువు నిష్ఠించి
తన కరిద్రోహంబు దన ద్రోహముగను - దన కల్లెనన్న నీ తప్పునకింక
గుఱి యెట్టు బిజ్జలక్షోణీశ! నీవ - పఱపంగఁ దలఁచితి భయమాత్మ లేక.

బావూరి బ్రహ్మయ్యగారి కథ


మఱియు బావూరి బ్రహ్మయనాఁగ నొక్క - గఱకంఠు భక్తుఁడఖండితకీర్తి
వీరమాహేశ్వరాచారవ్రతస్థుఁ - డారూఢగాఢమహత్త్యకాంతుండు
[2]మంగళభక్తి క్రియాంగభాషాంగ - సంగతచరితుఁడభంగప్రతాపి
స్థైర్యసంపన్నుండు శౌర్యపండితుఁడు - ధైర్యప్రపూర్ణుండవార్యవీర్యుండు
సత్యవచోరాశి శరణాగ్రగణ్యుఁ - డత్యుత్తమోత్తముఁడనఁగ నిబ్భువిని
బరగ జంగమలింగపాదారవింద - పరిచరణ క్రియాపరతంత్రలీల
నలయక పువ్వుఁదోఁటలు వెక్కు గూర్చి - తొలుకోడి గూయంగ బలువిడి నేఁగి
పూవులు గొనివచ్చి పుష్పమాలికలు - భావించి సంధించి భక్తుల [3]కిచ్చి

  1. పట్టభద్రుని
  2. జంగమ
  3. కిచ్చు, నట్టి